తన సారథ్యంలో పార్టీ మరింత బలోపేతం
ఢిల్లీ : బీహార్ కు చెందిన రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా ఉన్న నితిన్ నబిన్ కు ఊహించని రీతిలో ఏకంగా జాతీయ స్థాయి పదవి దక్కింది. ఆయనను భారతీయ జనతా పార్టీ హైకమాండ్ ఏకంగా జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించింది. ఈ సందర్బంగా తనపై ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా. తనకు అపారమైన అనుభవం ఉంది. సుదీర్ఘ కాలం పాటు బీహార్ రాజకీయాలలో పార్టీని మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాడని కితాబు ఇచ్చారు అమిత్ షా. ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నా , చాలా మంది పేర్లు తమ పరిశీలనకు వచ్చినప్పటికీ చివరకు నితిన్ నబిన్ వైపు మొగ్గు చూపాల్సి వచ్చిందన్నారు.
ఇదిలా ఉండగా నితిన్ నబిన్ ట్రాక్ రికార్డు గొప్పగా ఉంది. తను బీహార్ కు చెందిన మాజీ బీజేపీ నాయకుడు కిషోర్ ప్రసాద్ సిన్హా కుమారుడు. 2006లో తన తండ్రి మరణానంతరం ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించారు నితిన్ నబిన్. పాట్నా నుండి జరిగిన ఉప ఎన్నికలో తన మొదటి ఎన్నికలో విజయం సాధించారు. ఆయన బాంకిపూర్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2010, 2015, 2020, 2025 అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నికయ్యారు. ఇటీవల ముగిసిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో, నబిన్ ఆర్జేడీ అభ్యర్థిని 51,936 ఓట్ల తేడాతో ఓడించారు.





