స్పష్టం చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
న్యూఢిల్లీ : దేశంలో విమానయాన రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కేవలం రెండు ఎయిర్ లైన్స్ సంస్థలే ప్రస్తుతం గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. దీంతో ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా తయారైంది. దేశంలోని వివిధ ఎయిర్ పోర్టులలో ప్రయాణీకులు నానా తంటాలు పడుతున్నారు. సందిట్లో సడేమియా అన్న చందంగా ఇష్టానుసారం టికెట్ ధరలు పెంచుతూ పోతున్నారు. బాధ్యత కలిగిన కేంద్ర సర్కార్ చోద్యం చూస్తోంది. మరో వైపు అదానీకి ఇండిగో సంస్థను అప్పగించేందుకే నాటకాలు ఆడుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ధరల బహిరంగ దోపిడీపై భగ్గుమంటున్నారు.
ఈ తరుణంలో మెల్లగా స్పందించారు కేంద్ర విమానాయన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. గురవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విమానయాన సంస్థల అవకాశవాద ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. గతంలో కూడా కోవిడ్ మహమ్మారి, ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా లేదా ఇటీవల ఇండిగో సంక్షోభం వంటి ప్రధాన సంఘటనల సమయంలో అధిక విమాన ఛార్జీలను నియంత్రించడానికి కేంద్రం జోక్యం చేసుకుందని చెప్పారు . అసాధారణ పరిస్థితులలో విమాన ఛార్జీలను నియంత్రించడానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవడం తప్పదన్నారు.
లోక్‌సభలో ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కూడా, అలాంటి పరిస్థితి ఏదైనా తలెత్తితే, మంత్రిత్వ శాఖ దృష్టి ఆ సమస్యపైనే ఉంటుందన్నారు.





