కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కు కంగ్రాట్స్
అమరావతి : కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ను ప్రత్యేకంగా అభినందనలతో ముంచెత్తారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు . గురువారం అమరావతి సచివాలయంలో జరిగిన జిల్లాల కలెక్టర్ల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. స్మార్ట్ కిచెన్ విధానం గురించి వివరించారు కలక్టర్.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కడప జిల్లాలో చేపట్టిన స్మార్ట్ కిచెన్ ప్రాజెక్టు దేశానికే మోడల్ గా మారిందన్నారు. స్మార్ట్ కిచెన్, స్మార్ట్ హెల్త్ , స్మార్ట్ చిల్డ్రన్ అన్నట్టుగా ఈ విధానాన్ని తీర్చిదిద్దాలని ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు కడప స్మార్ట్ కిచెన్లను సందర్శించాలని సూచించారు నారా చంద్రబాబు నాయుడు. స్మార్ట్ కిచెన్ ద్వారా తాజా, రుచికరమైన ఆహారం అందించటం, న్యూట్రిషనిస్టుల సహాకారం తీసుకోవటం మంచి ఆలోచన అని ప్రశంసించారు.
నాచురల్ ఫార్మింగ్ ను కూడా దీనికి ఇంటిగ్రేషన్ చేయటం చాలా బాగుందన్నారు సీఎం. స్మార్ట్ కిచెన్ కు సర్టిఫికేషన్ కూడా తీసుకోవటం అభినందనీయం అని అన్నారు . టీటీడీ తరహాలోనే తనిఖీ వ్యవస్థ ఉండాలని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. రైతు బజార్లలోనూ నాచురల్ ఫార్మింగ్ ఉత్పత్తులు రావాలి. సర్టిఫికేషన్ తో పాటు డోర్ డెలివరీ వచ్చేలా ఉండాలన్నారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా అంగన్ వాడీలు, సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలకూ ఆహారం అందించాలని సూచించారు. కడపలోని అన్ని స్కూళ్లల్లో చిన్నారులకు, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు.





