ఎంకే స్టాలిన్ పై సీరియస్ కామెంట్స్
ఎరోడ్ : టీవీకే పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు దళపతి విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన గతంలో ఎన్నడూ లేనంతగా తమిళనాడు రాష్ట్ర సర్కార్ ను ఏకి పారేశారు. గత సెప్టెంబర్ 27న కరూర్ లో చోటు చేసుకున్న ఘటనలో 41 మంది మరణించిన తర్వాత గురువారం ఎరోడ్ లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు టీవీకే విజయ్. ఈ సందర్బంగా రేపు 2026లో జరిగే శాసన సభ ఎన్నికల్లో ప్రధాన పోటీ కేవలం అధికారంలో ఉన్న డీఎంకేకు టీవీకే పార్టీకి మధ్య పోరు కొనసాగుతుందని స్పష్టం చేశారు . ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తాము ఎన్నికలలో పోటీ చేయడం ఖాయమని అన్నారు. దివంగత ముఖ్యమంత్రులు ఎంజీఆర్ , జయలలితలను ప్రస్తావిస్తూ, వారు తరచుగా డీఎంకేను “తీయ శక్తి” (దుష్టశక్తి) అని వర్ణించే వారని ఆయన అన్నారు.
ఈ పోటీ ఇప్పుడు తూయ శక్తి టీవీకే , తీయ శక్తి డీఎంకే మధ్యే ఉందని అన్నారు. తనపై స్వార్థ శక్తులు దుష్ప్రచారం చేస్తున్నాయని కూడా ఆయన ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రులు సి.ఎన్. అన్నాదురై, ఎంజీఆర్ అందరికీ స్ఫూర్తి అని, వారు ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదని ఆయన అన్నారు. వారిని ప్రస్తావించినందుకు తమపై ఎవరూ ఫిర్యాదు చేయలేరని ఆయన నొక్కి చెప్పారు. శాంతిభద్రతలు , వ్యవసాయంతో సహా పలు అంశాలపై ఆయన డీఎంకే ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. టీవీకేలో ఇటీవల చేరిన, మాజీ ఏఐఏడీఎంకే సీనియర్ నాయకుడు, స్థానిక బడా నాయకుడైన కే ఏ సెంగోట్టయ్యన్ లాగే, మరికొంతమంది నాయకులు కూడా పార్టీలో చేరతారని, వారికి తగిన గుర్తింపు ఇవ్వబడుతుందని విజయ్ ప్రకటించారు.





