స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి : ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వారంతా తమ పనితీరుతో చిరస్థాయిగా నిలిచి పోయేలా ఉండాలని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలని అన్నారు. వర్తమాన, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గం ఆర్థికంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు పెంచాలన్నారు. మహిళలు, రైతుల సంక్షేమాన్ని విస్మరించకుండా ముందుకు వెళ్ళాలని సూచించారు డిప్యూటీ సీఎం. పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. జన సైనికులు, వీర మహిళలతో ఎప్పటికప్పుడు చర్చించాలన్నారు.
మంగళగిరిలో తొమ్మిది మంది శాసనసభ్యులతో వన్ టూ వన్ సమావేశాలు నిర్వహించారు పవన్ కళ్యాణ్.
నియోజకవర్గాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ పై సుదీర్ఘంగా చర్చించారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి, ఉపాధికి ఉన్న అవకాశాలు గుర్తించి వాటిని ముందుకు తీసుకువెళ్లే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. శాసన సభ్యుడిగా ఉన్న పదవి కాలంలో మనం చేసిన అభివృద్ధి నియోజకవర్గ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోవాలనే తపనతో పని చేయాలని స్పష్టం చేశారు. పని తీరు ప్రజలు మెచ్చేలా ఉండాలని దిశా నిర్దేశం చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ఏం కావాలో తెలుసు కోవడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ప్రజా సమస్యలపై వచ్చిన అర్జీల పరిష్కారానికి పెద్ద పీట వేయాలని చెప్పారు.





