రూ. 2500 కోట్ల విలువైన భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్
హైదరాబాద్ : ఐటీ కేంద్రంగా అత్యంత ఖరీదైన నెక్నాంపూర్ ప్రాంతంలో 23.16 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. రూ. 2500 కోట్లకు పైగా విలువ ఉన్న భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది. ఈ ఆక్రమణల వెనుక బడాబాబుల కుట్రలను హైడ్రా భగ్నం చేసింది. సామాన్యులను ముందు పెట్టి.. భూమిని సొంతం చేసుకుని రూ. కోట్లకు పడగలెత్తేందుకు బడాబాబులు చేసిన ప్రయత్నాలకు హైడ్రా చెక్ పెట్టింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం, నెక్నాంపూర్ విలేజ్ సర్వే నంబరు 20లో ఉన్న 23.16 ఎకరాల భూమి ఆక్రమణలకు గురి అవుతోందని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా ఈ చర్యలు తీసుకుంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు.. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో క్షేత్రస్థాయిలో హైడ్రా లోతైన విచారణ చేపట్టింది.
ప్రభుత్వ భూమిగా నిర్ధారించుకున్న తర్వాత ఆక్రమణలను హైడ్రా తొలగించింది. కొన్ని కట్టడాలను ఇప్పటికే నేలమట్టం చేయగా మరి కొన్ని ప్రహరీలతో పాటు షెడ్డులను తొలగించి వెనువెంటనే 23.16 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. అలాగే ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులను నెలకొల్పింది. ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోయి.. సామాన్యులను ముందుంచి కబ్జాల పర్వాన్ని నడిపించిన బడాబాబుల ఆగడాలకు హైడ్రా చెక్ పెట్టింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం పూర్తిగా ప్రభుత్వ భూమి అయినప్పటికీ.. పాకాల పోచయ్య దగ్గర భూమిని కొన్నట్టు మహ్మద్ ఇబ్రహీం అనే వ్యక్తి తప్పుడు రికార్డులను సృష్టించారు. ఇలా కొన్నామని చెప్పిన భూమికి సంబంధించి పాసు బుక్కులు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు నుంచి వచ్చిన ఆదేశాలతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు.





