కర్ణాటకలో చోటు చేసుకున్న ఘటన బాధాకరం
కర్ణాటక : కర్ణాటక రాష్ట్రంలో గురువారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి శివమొగ్గకు ప్రయాణం చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటన జాతీయ రహదారి 48వ నెంబర్ పై చోటు చేసుకుంది. బస్సులో మొత్తం 31 మంది ప్రయాణిస్తున్నారని, ఇప్పటి వరకు 18 మందికి పైగా సజీవ దహనం అయ్యినట్లు తెలిపారు పోలీసులు. ఘటన జరిగిన వెంటనే చిత్రదుర్గ ఎస్పీ హుటా హుటిన సంఘటనా స్థలానికి వెళ్లారు. పలువురు గల్లంతైనట్లు సమాచారం. రహదారిపై ఉన్న డివైడర్ ను ఢీకొన్న ట్రక్కు (లారీ) ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. గురువారం ఉదయం 2.30 నుంచి 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, లారీ బస్సు ఇంధన ట్యాంకును ఢీకొనడంతో ఇంధనం బయటకు చిమ్మింది. కొందరు ప్రయాణికులు మంటల నుండి తప్పించు కోగలిగారు. ఇప్పటి వరకు 18 మంది ప్రయాణికులు, ట్రక్కు డ్రైవర్ మరణించినట్లు వెల్లడించారు కర్ణాటక ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవికాంత్ గౌడ తెలిపారు. సీబార్డ్ కోచ్‌కు చెందిన ఈ బస్సులో డ్రైవర్, కండక్టర్‌తో సహా 32 మంది ఉన్నారని సమాచారం. ఈ ఘటనపై తీవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బస్సు ప్రమాదం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చని పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.






