ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
అమరావతి : భారత దేశం గర్వించదగిన జాతి రత్నాలు దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి, మాజీ సీఎం , దివంగత నందమూరి తారక రామారావు అని కొనియాడారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. తనకు నిత్యం స్ఫూర్తినిచ్చే నేత ఎన్టీఆర్ అని ముఖ్యమంత్రి అన్నారు. దేశంలో కాంగ్రెస్ వ్యతిరేక భావజాలనికి బీజం వేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. ‘ఎన్టీఆర్, వాజ్‌పేయి చాలా చనువుగా ఉండేవారు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఇందిరా గాంధీ రద్దు చేస్తే అద్వానీ, వాజ్ పేయి ఎన్టీఆర్‌ను ముందుకు నడిపించారు. నేషనల్ ఫ్రంట్ ద్వారా యాంటీ కాంగ్రెస్‌కు బీజం వేసి ప్రభుత్వాన్ని కూడా ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్, వాజ్ పేయి ప్రజలకు ఎప్పుడూ గుర్తుండేలా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతాం’ అని స్పష్టం చేశారు.
నేను చాలామంది నేతలను దగ్గరగా చూశాను. నాడు వాజ్ పేయ్, నేడు ప్రధాని మోదీ విశిష్ట లక్షణాలు, చరిత్ర తిరగరాసే నాయకత్వం ఉన్నవారు. వాజ్ పేయి మధ్యప్రదేశ్‌లో సాధారణ కుటుంబంలో జన్మించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. జన్‌సంగ్, బీజేపీ నుంచి 10 సార్లు లోక్‌సభకు, 2 సార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు. వాజ్‌పేయి తెలివైన నాయకుడే కాదు.. అద్భుత కవి..మానవతా వాది. నాతో చాలా సన్నిహితంగా ఉంటారు. నేను ఆయన ఆలోచనలు తెలిసిన వ్యక్తిని. దేశ ప్రగతికి గట్టి పునాదులు వేశారు. నేడు జాతీయ రహదారులపై తిరుగుతున్నామంటే దానికి ఆయన చొరవే కారణం. మనదేశంలో రోడ్లు గతంలో అధ్వాన్నంగా ఉండేవి. నేను చిన్నదేశమైన మలేషియాకు వెళ్లి అక్కడున్న 8 వరుసల రహదారులను చూసి వాజ్ పేయ్‌కి వివరించాను.
ఇంతపెద్ద దేశంలోనే మనం మంచి రోడ్డు వేయలేకపోతున్నామని ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో మొదటి సారి చెన్నై-తడకు జాతీయ రహదారి నిర్మించారు. నాలెడ్జి ఎకానమీకి వెన్నెముక టెలికామ్ సెక్టార్లో డీరెగ్యులేషన్ ప్రారంభించి ప్రగతికి పునాది వేశారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ 4జీ రివల్యూషన్‌తో ముందుకు దూసుకెళ్తున్నారు. పీపీపీ విధానంలో దేశం అభివృద్ధి అవుతుంది..ఏ దేశం కంటే మనం తక్కువ కాదని చెప్పి ఆచరణలో పెట్టిన వ్యక్తి వాజ్ పేయ్. రోడ్లు, ఎయిర్‌పోర్టులు, వంటి వివిధ ప్రాజెక్టులు తీసుకొచ్చారు. హైదరాబాద్‌లో గతంలో చిన్న ఎయిర్ పోర్టు ఉండేది… పెద్దగా విమానాలు వచ్చేవి కావు. విమానాశ్రయం అభివృద్ధి కోసం వాజ్ పేయిని కలిసిన వెంటనే ఓపెన్ స్కై పాలసీ తీసుకొచ్చారు. హైదరాబాద్‌కు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు వచ్చిందంటే దానికి కారణం వాజ్ పేయి. ఓపెన్ స్కై పాలసీ, నగరాల మధ్య రహదారులు లాంటి వివిధ సంస్కరణలు దేశ ప్రగతికి కీలక బిందువుగా నిలిచాయి’ అని సీఎం చంద్రబాబు అన్నారు.






