జనవరి 7వ తేదీ వరకు ఎస్ఎస్డీ టోకెన్లు రద్దు
తిరుమల : వైకుంఠ ద్వార దర్శనాలను పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లను తనిఖీ చేశారు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి. ఈ తనిఖీల్లో అదనపు ఈవో వెంట శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, అన్న ప్రసాద విభాగం డిప్యూటీ ఈవో రాజేంద్ర, హెల్త్ డిప్యూటీ ఈవో సోమన్నారాయణ, ఈఈ శ్రీనివాసులు, డిఈ చంద్రశేఖర్, ఐటీ డిప్యూటీ జీఎం వెంకటేశ్వర్లు నాయుడు, అశ్వని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి, పలువురు విజిలెన్స్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈసందర్బంగా ఏఈవో మీడియాతో మాట్లాడారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రతి రోజూ జారీ చేసే ఎస్ఎస్డీ టోకెన్లను రద్దు చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులను కోరారు.
ఈ సందర్బంగా వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు ఏఈవో. ఈనెల 30వ తేదీ నుండి వచ్చే జనవరి 8వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయన్నారు. తొలి మూడు రోజులు డిసెంబర్ 30, 31 , జనవరి 01వ తేదీల్లో ఈ-డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని స్పష్టం చేశారు. ఇతర భక్తులకు ఎలాంటి దర్శనం ఉండదని అన్నారు. కాగా టోకెన్ పొందిన భక్తులు తమకు కేటాయించిన తేదీలలో నిర్దేశించిన సమయానికి (Time Slot) మాత్రమే తిరుమలలోని దర్శన ప్రవేశ మార్గాలకు చేరుకోవాల్సి ఉంటుందన్నారు.







