అసెంబ్లీలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్
హైదరాబాద్ : అసెంబ్లీలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తన నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ఏకరువు పెట్టారు. తక్షణమే పరిష్కరించాలని కోరారు. తనపై నమ్మకం పెట్టుకుని గెలిపించారని, ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఇదే సమయంలో తనపై నమ్మకం ఉంచి, తనకు టికెట్ ఇప్పించటమే కాకుండా గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డికి ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా తన నియోజకవర్గంలోని కృష్ణా నగర్ వాసులు గత కొంత కాలంగా తీవ్రమైన సమస్యతో బాధ పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు నవీన్ యాదవ్.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన సలహాలతో మా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకు పోవడానికి కృషి చేస్తానని చెప్పారు. ఇదే సమయంలో వర్షాలు వస్తే చాలు కృష్ణా నగర్ మునిగి పోతుందని ఆవేదన చెందారు నవీన్ యాదవ్. ఇందు కోసం నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. తక్షణమే సర్కార్ స్పందించాలని, నిధులు కేటాయించాలని విన్నవించారు. జూబ్లీహిల్స్ లో హై టెన్షన్ లైన్ తో ఇబ్బంది పడుతున్నారని, దానిని తొలగించాలని అన్నారు. దీని వల్ల భారీ ప్రమాదం నెలకొంటుందని, అది రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు.






