భక్తులు సహకరించాలని విన్నపం
తిరుపతి : తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు సంచలన ప్రకటన చేశారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్లు ఉన్న భక్తులకే దర్శనం ఉంటుందన్నారు. మిగతా భక్తులు జనవరి 2వ తేదీ నుంచి దర్శనం చేసుకోవాలని సూచించారు. భక్తులు సహకరించాలని కోరారు. 2 వేల మందికి పైగా పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పిల్లలు, వృద్ధులు, విలువైన ఆభరణాల పట్ల భక్తులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఎస్పీ. భగవంతుని సేవ కోసమే వచ్చినట్లు గుర్తుంచుకొని విధులు నిర్వర్తించాలని సిబ్బందికి స్పష్టం చేశారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే 30,31,01 తేదీలలో వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందన్నారు.
తిరుమల ఆస్థాన మండపంలో జిల్లా పోలీస్ అధికారులతో నిర్వహించిన భద్రతా సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడారు . వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనార్థం స్థానిక ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి అశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. వైకుంఠ ద్వార దర్శనం మొత్తం 10 రోజులు ఉంటుందన్నారు. 29వ తేదీ రాత్రి 30వ తేదీ తెల్లవారుజామున నుండి దర్శనం ప్రారంభమవుతుందని తెలిపారు ఎస్పీ. ఆన్లైన్ ద్వారా అన్ని రాష్ట్రాల నుండి సుమారు 25 లక్షల మంది భక్తులు అప్లై చేయగా, ఒక్కో రోజుకు సుమారు 60,000 టోకెన్లు చొప్పున భక్తులు దర్శనాలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని వెల్లడించారు.







