శాసన మండలిలో కన్నీటి పర్యంతం
హైదరాబాద్ : శాసన మండలి సాక్షిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కన్నీటి పర్యంతం అయ్యారు. సోమవారం తాను రాజీనామా చేశానని, దానిని ఆమోదించాలని కోరారు. తన పుట్టింటి నుంచి అన్నిరకాల బంధాలు, బంధనాలు తెంచుకొని బయటకు వచ్చానని కల్వకుంట్ల కవిత ప్రకటించారు. తల్లిగారి ఇంటి నుంచి అవమాన భారంతో ఆత్మ గౌరవం కోసం బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. తెలంగాణ ఆడబిడ్డలకు పౌరుషం ఎక్కువని ఎవరినీ ఏదీ అడగరనీ, అవమానిస్తే మాత్రం చూస్తూ ఊరుకునే రకం కాదనీ స్పష్టం చేశారు. ప్రజలు, దేవుడి దయతో గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతానని అన్నారు. కవిత బీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు. పార్టీ రాజ్యాంగాన్ని ‘హాస్యాస్పదం’ అని అభివర్ణించారు. తను మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావును టార్గెట్ చేశారు. సిద్దిపేట, సిరిసిల్లలో వరదలను ఉదాహరణగా చూపుతూ, కలెక్టరేట్ భవనాల నిర్మాణంలో బీఆర్‌ఎస్ అవినీతికి పాల్పడిందని కవిత ఆరోపించారు.
తన సస్పెన్షన్ సమయంలో సరైన విధానాలను విస్మరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి కె చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని పార్టీపై విరుచుకుపడ్డారు. గత పార్టీ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో అవినీతి జరిగిందని ఆరోపించడం కలకలం రేపింది. తను తరచుగా భావోద్వేగాలకు లోనయ్యారు. బీఆర్‌ఎస్ పాలనలో తీసుకున్న కొన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలలో తాను భాగస్వామిని కాదని కూడా అన్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో బీఆర్‌ఎస్ నుండి సస్పెండ్ అయిన వెంటనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా సమర్పించిన కవిత, తన రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కోరారు. తనను సస్పెండ్ చేసిన పార్టీ క్రమశిక్షణా చర్యల కమిటీ రాత్రికి రాత్రే ఉనికిలోకి వచ్చిందని, షోకాజ్ నోటీసు జారీ చేయడం వంటి ఎలాంటి విధానాలను పాటించలేదని ఆమె ఆరపించారు.






