రాంపూర్‌లో 4 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్
హైదరాబాద్ : హైదరాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. భూ ఆక్రమణదారులు, కబ్జదారులకు చెక్ పెడుతోంది. ప్రతి సోమవారం హైడ్రా ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా వాణికి పెద్ద ఎత్తున బాధితులు పోటెత్తారు. భారీగా ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో వచ్చిన దరఖాస్తులను పరిశీలీంచిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా సిబ్బంది పెద్ద ఎత్తున ఆక్రమణలను గుర్తించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా తాజాగా భారీ ఎత్తున ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని గుర్తించారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లి విలేజ్ సర్వే నంబరు 388లో జలమండలికి (HMWSSB)కి చెందిన 4.01 ఎకరాల భూమిని హైడ్రా కాపాడింది.
జలమండలి అవసరాల మేరకు ఇక్కడ భూమిని కేటాయించింది గతంలో సర్కార్. దానిని స్వాధీనం చేసుకోవడంలో స్థానికులు ఇబ్బందులు పెట్టారు. ఆక్రమణదారులు వారిని బెదిరింపులకు గురి చేశారు. ప్రహరీ నిర్మాణాన్నిఅడ్డుకుని ఆటంకాలు సృష్టించారు. దీంతో హైడ్రా సహాయాన్ని జలమండలి కోరింది. సంబంధిత శాఖల అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించి జలమండలికి ప్రభుత్వం కేటాయించినట్టు హైడ్రా నిర్ధారించుకుంది. ఈ మేరకు 4.01 ఎకరాల జలమండలికి చెందిన భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. జలమండలికి చెందిన భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది.






