నిప్పులు చెరిగిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్. ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. పదే పదే అబద్దాలు మాట్లాడుతూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. కేసీఆర్ పాలనలోనే కదా పాలమూరులో పరిస్థితులు మారిందని, ఆ విషయం జనానికి బాగా తెలుసన్నారు. శిలాఫలకాలు వేయడం తప్ప ఈ ప్రభుత్వానికి ఏమీ చేత కాదని ధ్వజమెత్తారు శ్రీనివాస్ గౌడ్. కల్వకుర్తి నెట్టంపాడు బీమా కింద ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచింది కేసీఆర్ కాదా ? అని ప్రశ్నించారు. కేసీఆర్ తెచ్చిన పంపులు, కట్టిన కాలువలు కనిపించడం లేదా ? మెడికల్ కాలేజీలు ఇచ్చింది కేసీఆర్ కాదా ? అని నిలదీశారు సీఎంను .
తెలంగాణ కు దైవం కేసీఆర్ అని అన్నారు శ్రీనివాస్ గౌడ్. ఆయన తెలంగాణ తేకుంటే నువ్వు సీఎం అయ్యేవాడివా ? మంచి అవకాశం వస్తే దాన్ని దుర్వినియోగం చేస్తావా ? నడుం విరగ్గొట్టి పడుకోబెట్టా అని నీచంగా మాట్లాడుతావా ? హరీష్ రావు, కే టీ ఆర్ లను మారీచుడు, సుబాహుడు అంటావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళు నువ్వు ఏం చేశావని అడ్డుపడ్డారు . కాలువలు తొవ్వుతానంటే అడ్డుపడ్డారా ?
మేము మాట్లాడబట్టే పాలమూరు రంగారెడ్డి జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ కు మారిందన్నారు శ్రీనివాస్ గౌడ్ . జూరాలలో కిలో మీటర్ వరకు కూడా నీళ్లు లేవన్నారు. అదే శ్రీశైలం నుంచి జూరాల దాకా వంద కిలోమీటర్ల మేర నీళ్లు ఉన్నాయని చెప్పారు. ఈ సమయంలో మేధావులు మౌనంగా ఉంటే ఎలా అని ప్రశ్నించారు.






