మాజీ ముఖ్యమంత్రిపై మంత్రి గొట్టిపాటి షాకింగ్ కామెంట్స్
అమరావతి : మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, పల్నాడు జిల్లా ఇంచార్జి గొట్టిపాటి రవికుమార్. ఫ్యాక్షన్ రాజకీయాలకు తెర లేపాడని, లా అండ్ ఆర్డర్ కు భంగం కలిగించేలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు. ఇవాళ మంత్రి మీడియాతో మాట్లాడారు.
పల్నాడులో ప్రశాంత వాతావరణం నెలకొల్పి అక్కడి ప్రజలు బాగుపడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. కానీ దానిని చెడగొట్టేందుకు జగన్ ప్లాన్ చేశాడని ఆరోపించారు. అక్రమ సంపాదన మీద పుట్టిన వైసీపీకి, తెలుగువాడి అత్మగౌరవం కోసం పెట్టిన తెలుగుదేశం కి మధ్య తేడా ప్రజలకు బాగా తెలుసు అని అన్నారు గొట్టిపాటి రవికుమార్. గతంలో ఎక్కడ ఫ్యాక్షన్ ఉన్నా కఠినంగా అణచివేసి ప్రజలు సుఖశాంతులతో ఉండాలనే లక్ష్యంతో వ్యవహరించిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని స్పష్టం చేశారు.
అధికారంలో ఉన్న 5 ఏళ్ళు జగన్ పల్నాడు లో హింసను ప్రేరేపించాడని సంచలన ఆరోపణలు చేశారు గొట్టిపాటి రవికుమార్. పల్నాడు లో తెలుగుదేశం నేతల పరామర్శకు చంద్రబాబు వెళ్లకుండా ఆయన ఇంటి గేటుకు తాళ్లు కట్టారని ఆరోపించారు. ఆ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. యరపతినేని నియోజకవర్గం పిన్నెలి గ్రామంలో 300 మంది ఊరు విడిచి వెళ్లిపోయేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి. ఒక్క గురజాల నియోజకవర్గంలోనే ఎస్సీ, బీసీలను 12 మందిని చంపేశారని ఆరోపించారు.
అక్రమ మైనింగ్ గుంటల్లో పిల్లలు చనిపోతే ఎవ్వరూ పట్టించు కోలేదని అన్నారు. హత్యా రాజకీయాలు ఎక్కడ జరిగినా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని తప్పు చేసిన ఎవర్నీ వదిలిపెట్టదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.






