పాలేరు సభలో ముఖ్యమంత్రి షాకింగ్ కామెంట్స్
ఖమ్మం జిల్లా : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మరోసారి నోరు పారేసుకున్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా మాజీ సీఎం కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను, కల్వకుంట్ల కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో టీడీపీని లేకుండా చేయాలని చూసిన కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్రంలో సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి తన స్థాయి, హోదా మరిచి ఫక్తు టీడీపీ కి వకల్తా పుచ్చుకుని మాట్లాడటం విడ్డూరంగా ఉంది. పాలేరులో జరిగిన సభలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం చర్చకు దారి తీసేలా చేసింది. రాష్ట్రంలో సవాలక్ష సమస్యలు పేరుకు పోయాయి. వాటిని పరిష్కరించాల్సింది పోయి వ్యక్తిగత విమర్శలు చేయడం, దూషించడం పనిగా పెట్టుకోవడం సబబు కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇది పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన దిమ్మెలను కూల్చాలని స్వయంగా సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి పిలుపు ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేసింది. రాష్ట్రంలో టీడీపీని కక్ష గట్టి దెబ్బతీసిన మాజీ సీఎం కేసీఆర్ ను.. బీఆర్ఎస్ ను సమూలంగా వంద మీటర్ల గొయ్యి తీసి బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. ఊర్లలో ఆ పార్టీ దిమ్మెలు కూల్చాలి. ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు అనుచరులు సహచరులకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. మనందరిపై బాధ్యత ఉందన్నారు. మమ్మల్ని బద్నాం చేయొద్దంటూ పేర్కొన్నారు సీఎం. సింగరేణిలో కుంభకోణం జరిగింది, బొగ్గు మాయమైందని.. కొన్ని పత్రికల్లో ప్రచారం చేస్తున్నారని ఇది మంచి పద్దతి కాదన్నారు. ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావులేదు. తప్పుడు ప్రచారాలతో అపోహలు సృష్టించి మారీచుడు, సుబాహుడు బలపడేందుకు సహకరిస్తున్నారని ఆరపించారు.





