తన జీవితంలో మరిచి పోలేని రోజు అన్న అనుముల
ములుగు జిల్లా : ప్రపంచంలోనే అతి పెద్ద మేడారం జాతరకు జనం పోటెత్తారు. ఈ సందర్బంగా సోమవారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. మేడారం ఆలయంలోని సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం. తన జీవితంలో శాశ్వతంగా గుర్తుండిపోయే రోజుగా ఉండి పోతుందన్నారు. ఈ గడ్డకు పోరాటాల స్ఫూర్తి నింపిన మేడారం సమ్మక్క – సారలమ్మల గద్దెలను ప్రజా ప్రభుత్వంలో పునర్నిర్మించి భక్తులకు అంకితం చేసే పవిత్ర అవకాశం నాకు లభించడం ఆనందంగా ఉందన్నారు. ఇది తనకు వన దేవతలు కల్పించిన అరుదైన అవకాశంగా భావిస్తున్నట్లు చెప్పారు రేవంత్ రెడ్డి.
ఇవాళ కుటుంబ సమేతంగా, సహచర మంత్రుల సమేతంగా వనదేవతలు, జన దేవతలైన సమ్మక్క – సారలమ్మ గద్దెలను సందర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న సందర్భం మరచిపోలేని పవిత్ర జ్ఞాపకం అని పేర్కొన్నారు సీఎం.ఆదివాసీల అతిపెద్ద పండుగ అయిన మేడారం సమ్మక్క – సారలమ్మ పుణ్యక్షేత్రం పునరుద్ధరణ పూర్తయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రజలకు అంకితం చేశారు. ఈ చారిత్రాత్మక ఘట్టంలో ముఖ్యమంత్రి , కుటుంబ సమేతంగా సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ఆశీర్వాదం పొందారు.
దాదాపు వెయ్యేళ్ల వీరగాథకు, జాతి వారసత్వ సంపదకు సంబంధించిన చరిత్రకు అద్దం పట్టేలా రూపుదిద్దుకున్న మేడారం గద్దెలు, ఆలయ ప్రాంగణాన్ని పునః ప్రారంభించిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు.






