కీలక ప్రకటన చేసిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్
తిరుపతి : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచలన ప్రకటన చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని ఆలయాలలో నిరంతరం అన్నదానం అమలు చేస్తామని తెలిపారు. వచ్చే మార్చి నెలాఖరు వరకు ఇది పూర్తవుతుందన్నారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు ఈవో.
టిటిడిలోని ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న ఏఈ పోస్టుల భర్తీ కోసం వచ్చే ఏప్రిల్ మాసంలో పరీక్షలు నిర్వహించేందుకు తేదీలను ఖరారు చేయాలని స్పష్ం చేశారు. వేద పారాయణదారులుగా ఎంపికైన వారిలో 164 మందిని టిటిడి ఆలయాలలో నియమించగా, మిగిలిన 536 మందిని ఇతర ఆలయాలలో నియమించేందుకు వీలుగా ఫిబ్రవరి మాసంలో ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు. టిటిడి ప్రమాణాలకు అనుగుణంగా 150 మంది అర్చకులకు, 68 మంది పోటు వర్కర్లకు ఫిబ్రవరి నెలలో మూడు విడతలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు.
భక్తుల సౌకర్యార్థం మరింత మెరుగైన సదుపాయాలు, టిటిడి సేవలు, సమాచారం తదితర అంశాలపై భక్తుల నుండి వస్తున్న ఈ – మెయిల్స్‌ను విశ్లేషించి, పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు పంపాలని ఆదేశించారు. అలాగే భక్తులు కోరుతున్న తాజా సమాచారాన్ని టిటిడి వెబ్‌సైట్‌లో నిరంతరం అప్‌డేట్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం, ఎఫ్‌ఏ అండ్ సీఏవో ఓ. బాలాజీ, సీఈ టి.వి. సత్యనారాయణతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.






