భావోద్వేగానికి గురైన నటి రేణు దేశాయ్
హైదరాబాద్ : నటి రేణు దేశాయ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె వీధి కుక్కలకు సంబంధించి సీరియస్ గా స్పందించారు. తమ తమ పరిసరాల్లో వీధి కుక్కల గురించి తెలిస్తే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలే తప్పా చంపడం ఏంటి అని ప్రశ్నించారు. తాను ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. ఈ దేశంలో సవాలక్ష సమస్యలు ఉన్నాయని, వాటిపై ఎందుకు నోరు మెదపడం లేదంటూ నిప్పులు చెరిగారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే . వందల సంఖ్యలో నోరు లేని జీవాలను చంపే హక్కు మీకు ఎవరు ఇచ్చారంటూ నిలదీశారు. సూటిగా ప్రశ్నించారు రేణు దేశాయ్. ప్రతి రోజూ కుక్కలకు సేవలు చేస్తుంటానని, అవి ఏనాడూ తనను కరవ లేదన్నారు. మనుషులకంటే , వాళ్లు చేసే దారుణాల కంటే శునకాలే నయం అని స్పష్టం చేశారు.
ఈ దేశంలో ప్రతి రోజు వందలాది మంది అమాయకులు కామాంధుల పాలిట బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పుకోలేని రీతిలో అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయని, లక్షలాది మంది దోమకాటు కారణంగా చని పోతున్నా ఎందుకు స్పందించడం లేదన్నారు. హెల్మెట్ లేని కారణంగా రహదారి ప్రమాదాలకు గురవుతున్నారని, ఇక మహిళలు, బాలికలు, యువతులపై పెద్ద ఎత్తున హత్యలు, అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయని ఇవి మీకు ఎందుకు కనిపించడం లేదన్నారు. మద్యం ఏరులై పారుతోందని, పొద్దస్తమానం వైన్స్ దుకాణాల వద్ద తాగుతున్న వారి గురించి మీకు తెలియక పోవడం, వాటిని నియంత్రించక పోవడం దారుణమన్నారు రేణు దేశాయ్.






