హామీలు నెరవేరుస్తున్నామన్న మంత్రి సవిత
అమరావతి : ఎన్నికల సందర్బంగా నేతన్నలకు ఇచ్చిన హామీని నెరవేర్చడం జరిగిందని చెప్పారు రాష్ట్ర బీసీ, చేనేత సంక్షేమ శాఖ మంత్రి ఎస్ . సవిత. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ గతంలో మాట ఇచ్చారని, ఆచరణలో చేసి చూపించారని అన్నారు. నేతన్నలకు 50 ఏళ్లకే రూ.4 వేల పెన్షన్ అందజేస్తున్నామన్నారు. నూలు కొనుగోలుపై 15 శాతం రాయితీ అందజేస్తున్నట్లు వెల్లడించారు. జనవరిలో చేనేత సహకార సంఘాలకు రూ.7 కోట్ల బకాయిలు అందజేశామని, రూ.1.67 కోట్ల త్రిఫ్ట్ నిధులు ఆయా బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని మంత్రి తెలిపారు. నేతన్నలకు ఉచిత విద్యుత్ అందజేయాలని నిర్ణయించామన్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి రానుందన్నారు. మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు, మరమగ్గం నేతన్నలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందజేయ నున్నామన్నారు.
ఈ పథకం వల్ల 1,03,454 కుటుంబాల్లో నాలుగు లక్షల మందికి లబ్ధి చేకూరనుందన్నారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహకాయంలో టెక్స్ టైల్స్ పార్కులు, మెగా క్టస్లర్లు, క్లస్టర్ల నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. నేతన్నలకు గౌరవప్రదమైన జీవనం కల్పించడమే కూటమి ప్రభుత్వం, సీఎ చంద్రబాబు నాయుడు ప్రధాన లక్ష్యమన్నారు. అంతకు ముందు ఏపీ పద్మశాలీ సంఘ ప్రతినిధులు మంత్రి సవితను కలిసి, పలు సమస్యల పరిష్కారానికి వినతిపత్రం అందజేశారు. వచ్చే ఏప్రిల్ 26న మంగళగిరిలో పద్మశాలీ రాష్ట్ర మహా సభ నిర్వహించనున్నామని, ఆ సభలో పాల్గొనాలని మంత్రి సవితను ఆహ్వానించారు. ఇందుకు మంత్రి సవిత సుముఖం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ పద్మశాలీ సంఘం, చేనేత సంఘ ప్రతినిధులు జె.శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, వెంకట సాంబశివరావు, కొల్లి బాబూరావు, గౌరీ శంకర్రావు, తుమ్మలచర్ల గణపతి ఉన్నారు.






