గాంధీభవన్ లోనే ఫిరాయింపు ఎమ్మెల్యేల సంసారం
కరీంనగర్ జిల్లా : కేంద్ర హొం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ నిర్వాకంపై భగ్గుమన్నారు. కాంగ్రెస్ పార్టీ నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చిందని ఆరోపించారు. రాజకీయ వ్యభిచారం చేస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు బండి సంజయ్ కుమార్ పటేల్. జిల్లా కాంగ్రెస్ ఆఫీసుల్లో మీటింగులు పెట్టడం, వాళ్లే బీ-ఫామ్ పంచుతున్నారంటూ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు కేంద్ర మంత్రి.
ఇది పూర్తిగా రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమన్నారు. స్పీకర్ కళ్లుండి కబోధిగా మారారంటూ మండిపడ్డారు బండి సంజయ్ కుమార్ పటేల్. స్పీకర్ పదవికి మచ్చ తేవడం న్యాయమేనా అని ప్రశ్నించారు . ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. వాళ్లు ఏ పార్టీలో ఉన్నారు.. ఎందుకు ఓటేయాలని అడగాలని ప్రజలకు పిలుపునిచ్చారు . ఓట్ల కోసం వచ్చే ఫిరాయింపు ఎమ్మెల్యేలను నిలదీయాలని అన్నారు. ఇకనైనా మేలు కోవాలని లేకపోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు. .





