తెలంగాణను దోచుకుంటున్న ముఖ్యమంత్రి
హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డిపై. రోజు రోజుకు నోటి దురద పెరిగి పోయిందన్నారు. సీఎం బూతు పురాణానికి హద్దు అదుపు లేకుండా పోయిందన్నారు. తెలంగాణ నీటి వాటాను పక్క రాష్ట్రాలకు ధారాదత్తం చేస్తున్న రేవంత్ రెడ్డి అనే ‘కోవర్టు’ ద్రోహంపై నిప్పులు చెరిగారు.
ప్రజల తీర్పే.. కేసీఆర్ కు ఇచ్చే అసలైన గౌరవం అని పేర్కొన్నారు. పదేళ్ల ఉజ్వల ప్రగతి తర్వాత, ఈ రెండేళ్లలో తెలంగాణ అనుభవిస్తున్న ఈ దుర్గతికి కారణాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు కేటీఆర్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి గాలి మాటలకు, గాయిగత్తర బూతులకు కాలం చెల్లిందన్నారు. సమస్యల నుంచి పారిపోవడానికి ఆ అసమర్థుడు వేస్తున్న పాచిపోయిన పాచికలను తిప్పికొట్టాలని అన్నారు.
తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఒక ధ్రువతార అని స్పష్టం చేశారు. ఆయన కీర్తి, ఆయన స్ఫూర్తి నిరంతరం వెలుగులీనుతూ మనకు మార్గదర్శనం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు కేటీఆర్. తెలంగాణ బిడ్డలారా.. చీకటి ఉన్నంత కాలం అబద్ధం ఆటలాడుతుంది.. కానీ సూర్యోదయం కాగానే తోకముడిచి పారిపోతుందని గుర్తు పెట్టుకోవాలని అన్నారు . తెలంగాణకు ఇది గ్రహణ కాలం. రేవంత్ అనే రాహువు తెలంగాణను కబళిస్తున్న కాలం. ఇప్పుడు రాష్ట్ర ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత మన భుజస్కంధాలపై ఉందని గుర్తు పెట్టుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి అసమర్థ పాలనపై, ఆయన చేస్తున్న ద్రోహంపై ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రశ్నలను పిడుగుల్లా కురిపించాలని కోరారు.





