కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ తో సీఎం
న్యూఢిల్లీ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రులు అమిత్ చంద్ర షా, నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్ లతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఆయన వెంట కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కింజారపు రామ్మోహన్ నాయడు, వర్మ, ఎంపీలు ఉన్నారు. ఇదిలా ఉండగా ఏపీకి రావాల్సిన ప్రాజెక్టులను మంజూరు చేయాలని కోరారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ను కలిసి. అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయ్యారు. ఈ ఇద్దరూ కీలక అంశాలపై చర్చించారు. దాదాపు గంటకు పైగా సాగింది వీరి చర్చ.
ఇదిలా ఉండగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను, వేస్ట్ మేనేజ్మెంట్, జీరో ల్యాండ్ ఫిల్ స్టేట్ గా ఏపీని తీర్చిదిద్దేందుకు తీసుకున్న చర్యలను కేంద్ర మంత్రి ఖట్టర్ కు వివరించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) 2.0 కింద రూ. 276 కోట్ల ఖర్చుతో జీరో ల్యాండ్ ఫిల్ స్టేట్ కు కార్యాచరణ రూపొందించినట్టు చెప్పారు. స్వచ్ఛ భారత్ మిషన్-2.0లో భాగంగా కేంద్ర వాటా కింద రూ. 105 కోట్లు మంజూరు చేయాలని కోరారు.





