నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిల
అమరావతి : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గిన మోదీ ఏకంగా భారత దేశ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టాడని సంచలన ఆరోపణలు చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథక పరిరక్షణ యాత్రలో భాగంగా ఆమె నెల్లూరు జిల్లాలో పర్యటించారు.
భారత ఇంధన భద్రతను ట్రంప్ కి మొత్తంగా కట్టబెట్టారంటూ మండిపడ్డారు. అగ్రరాజ్యం ఒత్తిడికి సాగిలపడ్డ మోదీజీ దేశ భవిష్యత్ నే తాకట్టు పెట్టారంటూ ఫైర్ అయ్యారు. భారత రైతులను ఉరికొయ్య ఎక్కించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు షర్మిలా రెడ్డి.
దేశ అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యవసాయాన్ని చంపేశారంటూ వాపోయారు. అమెరికాతో ట్రేడ్ డీల్‌లో నిజంగా ఎలాంటి లాజిక్ లేదని అన్నారు. భారత్ ఎలాంటి దామాషా ప్రయోజనాలు పొందలేదని చెప్పారు. ఇరాన్ నుంచో, రష్యా నుంచో, మరో చోట నుంచో చమురు కొనుగోలు చేయాలని అమెరికా ఎలా నిర్ణయిస్తుందని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ వాస్తవాలు చెబితే తట్టుకోలేక పోతున్నారని, ఆయన గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. దేశ భవిష్యత్ ను కాపాడే విషయంలో వెనుకంజ వేసేది లేదన్నారు. దేశ ప్రజలు ఇప్పుడు రాహుల్ గాంధీ పక్షమే ఉన్నారని, ఆ విషయం మోదీ తెలుసుకుంటే మంచిదన్నారు.





