ఆదరణ 3.0లో రజకులకు వాషింగ్ మెషిన్లు

VijayaBhaskar · March 5, 2026
Spread the love

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి ఎస్. స‌విత‌

అమ‌రావ‌తి : శాస‌న మండ‌లి సాక్షిగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. రాష్ట్రంలోని ర‌జ‌కుల‌కు తీపి క‌బురు చెప్పారు. దేశంలో మొట్టమొదటి సారిగా 2014-19 మధ్య రజకల ఆర్థిక వృద్ధి కోసం ధోబి ఘాట్లు నిర్మించిన ఘనత సీఎం చంద్రబాబుదేని మంత్రి సవిత తెలిపారు. రాబోయే ఆదరణ 3.0 పథకంలోనూ రజకులకు వాషింగ్ మిషన్లు, ఆధునిక పరికరాలు అందజేయబో తున్నామన్నారు. వడ్డెర్లను, మత్స్యకారులను, రజకులను, వాల్మీకీలను ఎస్సీ, ఎస్టీ జాబితాలో చేర్చే అంశం పరిశీలిస్తున్నామని చెప్పారు. ఆయా కమిటీల నివేదికలు రావాల్సి ఉందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ జాబితాలో కొత్త కులాలను చేర్చే అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని, ఈ విషయం సభ్యులకు కూడా తెలుసని మంత్రి సవిత తెలిపారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో అయిదేళ్ల పాటు బీసీలకు జగన్ చేసిందేమీ లేదని మంత్రి సవిత స్పష్టం చేశారు. 2014-19 మధ్య ఆయా కులాలను ఎస్సీ, ఎస్టీ జాబితాల్లో చేర్చడానికి అధ్యయన కమిటీలను అప్పట్లో తమ ప్రభుత్వమే నియమించిందన్నారు. త‌ర్వాత‌ వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆయా కమిటీలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. వడ్డెర్లతో పాటు అన్ని బీసీ కులాలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దనున్నామన్నారు. బీసీలకు పునాదులు, వాళ్లకు అభివృద్ధి చేసిందీ తామేనని మంత్రి సవిత స్పష్టం చేశారు.