రాజ్య‌స‌భ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా వేం న‌రేంద‌ర్ రెడ్డి

VijayaBhaskar · March 5, 2026
Spread the love

లైన్ క్లియ‌ర్ చేసిన సీఎం రేవంత రెడ్డి , ఏఐసీసీ

హైద‌రాబాద్ : అందరూ అనుకున్న‌ట్టుగానే బీసీల జ‌పం చేసిన కాంగ్రెస్ పార్టీ మ‌రోసారి రెడ్డి సామాజిక వ‌ర్గానికి ప్ర‌యారిటీ ఇచ్చింది. ఓ వైపు బీసీల‌కు సామాజిక ప్రాధాన్య‌త ద‌క్కాల‌ని అంటూనే ఇంకో వైపు బహిరంగంగానే ఉన్న‌త వ‌ర్గాల‌కు కీల‌క‌మైన ప‌ద‌వుల‌ను క‌ట్ట‌బెట్టింది. ఇప్ప‌టికే బీసీలు పెద్ద ఎత్తున ఆందోళ‌న బాట ప‌ట్టారు. అయినా ప‌ట్టించుకోవ‌డం లేదు కాంగ్రెస్ పార్టీ. తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి గుండె కాయ లాంటి వ్య‌క్తిగా పేరు పొందిన‌, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా ఉన్న ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన వేం న‌రేంద‌ర్ రెడ్డికి మ‌రో కీల‌క ప‌ద‌వి ద‌క్క‌నుంది. ఇప్ప‌టికే రాష్ట్రం నుండి రెండు రాజ్య‌స‌భ సీట్లు ఖాళీ అయ్యాయి. వీటి స్థానాల‌లో ఎవ‌రిని నియ‌మించాల‌నే దానిపై క‌స‌ర‌త్తు జ‌రిగింది. చివ‌ర‌కు సీఎం రేవంత్ రెడ్డి సూచించిన వేం న‌రేంద‌ర్ రెడ్డికే ఏఐసీసీ హై క‌మాండ్ ఓటు వేసింది. ఇందులో పెద్ద‌ల‌ను ఒప్పించ‌డంలో రేవంత్ స‌క్సెస్ అయ్యాడు.

దీంతో హైదరాబాద్‌లోని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ని త‌న‌ నివాసంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ గౌడ్ వేం నరేందర్ రెడ్డి ని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం, తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎంపికైన వేం నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థిగా టీపీసీసీ అధ్యక్షులు ‘బి-ఫాం’ను అందజేశారు.