కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ విషయంలో కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నో దశాబ్దాలకు పైగా ఎస్సీ ఉప కులాల వర్గీకరణ అంశం నలిగిందని అన్నారు. వర్గీకరణ సాధించాలన్న తపనతో పోరాటంలో కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏళ్ల నుంచి ఈ సమస్యను ప్రత్యక్షంగా చూశానని చెప్పారు . ప్రతి సందర్భంలోనూ చేతైనంత మేరకు సహాయం చేశానని, చిక్కుముడులు, కమిషన్లు, తర్జనభర్జనలు జరిగాయని అన్నారు సీఎం. అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చినప్పుడు మమ్మల్ని బయటకు గెంటివేశారని వాపోయారు.
అయితే వర్గీకరణ అంశంలో నేను మిత్రధర్మాన్ని నిర్వర్తించానని చెప్పారు. మాదిగలకు అండగా నిలబడ్డాను. ఇందులో న్యాయం ఉందన్నారు. బలహీనులు కాబట్టే అండగా నిలబడ్డాను. రాజకీయ పరమైన ఒత్తిడులు ఎదురైనప్పటికీ మాదిగలకు అండగా నిలిచానని చెప్పారు. నా ప్రయత్నంలో మంత్రివర్గ సహచరులు, అధికారులు సమయస్ఫూర్తిని చూపించి అండగా నిలిచారని ప్రశంసించారు.
సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం దేశంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన మొట్ట మొదటి రాష్ట్రం మనదేనని అన్నారు. వర్గీకరణ అన్ని సమస్యలకు పరిష్కారం చూపించక పోవచ్చని పేర్కొన్నారు.
ప్రమోషన్లు, ఉన్నత విద్య, భూములు, లిడ్ క్యాప్ భూములను కాపాడుకోవడం వంటి సమస్యలను పరిష్కరించడం పెద్ద అంశం కాదన్నారు. సమస్యలను పరిష్కరిస్తున్న సమయంలో వెనకనుంచి జరిగే దాడులను మీరు ఆపాలని, మీ జాతి అండగా నిలవాలని పిలుపునిచ్చారు సీఎం.





