మంత్రి దామోదర రాజ నరసింహ కామెంట్స్
సంగారెడ్డి జిల్లా : పరమత సహనానికి, ఆధ్యాత్మిక విలువలకు ప్రతీక పవిత్రమైన రంజాన్ పండుగ అని పేర్కొన్నారు రాష్ట్ర విద్యా, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ. సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మంత్రులు దామోదర్ రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరయ్యారు
ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడారు. రంజాన్ మాసం పవిత్రమైనది అని అన్నారు. ఈ నెలలో ఉపవాసం, ప్రార్థనలు, దానం వంటి ఆధ్యాత్మిక విలువలు సమాజానికి ఐక్యతను, సోదర భావాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. రాష్ట్రంలో అన్ని మతాలు, వర్గాల ప్రజలు పరస్పర గౌరవంతో కలిసి జీవించడం తెలంగాణ ప్రత్యేకత అని అన్నారు. రంజాన్ మాసం శాంతి, సౌభ్రాతృత్వం, సుసంపన్నతను తీసుకు రావాలని ఆకాంక్షించారు. ఇఫ్తార్ ఏర్పాటు చేసిన జగ్గారెడ్డిని మంత్రి అభినందించారు.





