ఘనంగా నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు
అమరావతి : సామాజిక విప్లవ నాయకుడు దొమ్మేటి వెంకట్ రెడ్డి అని ప్రశంసించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా దొమ్మేటి జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్బంగా సచివాలయంలో తన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దొమ్మేటి వెంకట్ రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శెట్టిబలిజ సంక్షేమ సంఘ స్థాపకుడిగా, సంఘ సంస్కర్తగా , మానవతావాదిగా పేరు పొందారని ప్రశంసించారు. శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఏర్పాటుతో బలహీన వర్గాల ఆత్మగౌరవ జ్యోతి వెలిగించిన మహనీయులు దొమ్మేటి వెంకటరెడ్డి అని కితాబు ఇచ్చారు. ఆయన చేసిన సామాజిక సేవలకు గుర్తుగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు నారా చంద్రబాబు నాయడుఉ.
దేశ స్వాతంత్య్రానికి పూర్వమే సామాజిక సేవతో పాటు, శెట్టిబలిజల అభ్యున్నతికి కృషి చేసి అందరి గుండెల్లో నిలిచారని అన్నారు. ‘చదువుతోనే సాధికారత’ అనే సత్యాన్ని, విద్య ప్రాముఖ్యతను ఆరోజుల్లోనే చాటి చెప్పారని చెప్పారు. సామాన్యులపై జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి, తన వారందరికీ ధైర్యాన్ని ఇచ్చిన ధీశాలి దొమ్మేటి వెంకటరెడ్డి అని కొనియాడారు. ఈ జయంతి వేడుకల వేళ ఆయనను స్మరించుకుని, స్ఫూర్తి పొందుదాం అని పిలుపునిచ్చారు నారా చంద్రబాబు నాయుడు.





