రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు
అమరావతి : ఏపీకి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొననున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు, ఎల్లుండి మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు, మరోవైపు కొన్ని జిల్లాల్లో ఎండలు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు . దక్షిణ కోస్తాంధ్ర -పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఏపీఎస్డీఎంఏ ఎండీ తెలిపారు. రాయలసీమ, పరిసర ప్రాంతాలపై మరోక ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని పేర్కొన్నారు.
వీటి ప్రభావంతో రేపు ఎల్లుండి మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు. సోమ, మంగళవారాల్లో వాతావరణం క్రింద విధంగా ఉండనున్నట్లు ప్రఖర్ జైన్ వివరించారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి , పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.





