సర్కార్ ను డిమాండ్ చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
కరీంనగర్ జిల్లా : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. హుజూరాబాద్ డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఐక్య నిరసన, దీక్షకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది.
హుజూరాబాద్‌లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయానికి వ్యతిరేకంగా రాంపూర్, రంగాపూర్, కందుగుల, ధర్మరాజుపల్లి ,జూపాక సిర్సపల్లి,రాజపల్లి గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు డంపింగ్ యార్డ్ వల్ల పంటలు, చెరువులు, భూగర్భ జలాలు , ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతినేలా చేసే ఈ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, ఈ నెల 7, 8 తేదీలలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి , జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరాహార దీక్షకు గ్రామాల ప్రజలందరూ స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో పాల్గొంటామని ప్రకటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం గౌరవించాలని కోరారు. హుజూరాబాద్‌లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలతో కలిసి చివరి వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.





