వరుస వైఫల్యాలతో ఫ్యాన్స్ ఆగ్రహం
చెన్నై : ఐసీసీ టి20 వరల్డ్ కప్ హీరోగా గుర్తింపు పొందిన కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తనను ఏరికోరి చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తీసుకుంది. భారీ ధరకు కొనుగోలు చేసింది. రాజస్థాన్ రాయల్స్ నుంచి తన కోసం కీలకమైన ఇద్దరు ఆటగాళ్లను వదులుకుంది. వారిలో ఒకరు స్టార్ బౌలర్ సామ్ కరన్ కాగా మరొకరు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. తాజాగా ఐపీఎల్ 2026 మెగా టోర్నీ ప్రారంభమైంది. ఇప్పటి వరకు సీఎస్కే జట్టు మూడు మ్యాచ్ లు ఆడింది.
ఈ మూడిట్లోను ఏ మాత్రం పోటీ ఇవ్వకుండానే చతికిల పడింది. ప్రధానంగా ఎక్కువ ధరకు తీసుకున్న సంజు శాంసన్, ఆడుతాడని అనుకున్న కెప్టెన్ సైతం తీవ్ర నిరాశకు గురి చేశారు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ లలో సంజు శాంసన్ చేసింది 6, 7, 9 పరుగులు మాత్రమే. అదే వరల్డ్ కప్ లో 5 మ్యాచ్ లు ఆడి 321 రన్స్ చేశాడు. ఈ సందర్బంగా తమిళ తంబిలు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. సంజు శాంసన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మీరు మానసికంగా సిద్ధంగా లేకపోతే, కొన్ని మ్యాచ్‌లకు తప్పుకోండి. ఇది కేవలం పరుగుల గురించే కాదు. మీ హావభావాలు మీకు ఆసక్తి లేదని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కెమెరా మీపై ఉన్న ప్రతిసారీ, మీరు నిరాశగా, సంబంధం లేనట్లుగా కనిపిస్తున్నారు. నిజం చెప్పాలంటే, ఒక్కసారి కూడా నవ్వుతూ చూడలేదు. అంగీకరించడానికి కష్టంగా ఉన్న విషయం ఏమిటంటే, మీలో శక్తి, పట్టుదల, పోరాట పటిమ లేకపోవడం. ఆ అభిరుచి ఎక్కడ? ఆ కసి ఎక్కడ? కనీసం మీకు శ్రద్ధ ఉందని అయినా చూపించండి.






