మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి
అమరావతి : వైసీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో వేమూరి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఏబీఎన్ చానల్ కార్యాలయంపై దాడికి దిగడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్. మంగళవారం ఆయన సామాజిక వేదికగా స్పందించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. పూర్తిగా ప్రజాస్వామ్యంపై , మీడియా స్వేచ్ఛపై జరిగిన ఏకపక్ష దాడిగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను పంచుకునే లేదా వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంటుందన్నారు. ఆ విషయం తెలుసుకోకుండా ఇలాంటి దాడులకు దిగడం మంచి పద్దతి కాదని హితవు పలికారు ఆలపాటి సురేష్ కుమార్.
ఏబీఎన్, ఆంధ్రజ్యోతి యాజమాన్యం లేదా ఓనర్ , చైర్మన్ గనుక వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేలా వార్తలు రాసినా లేదా ప్రసారం చేసినా వాటిపై అభ్యంతరం తెలియ చేయవచ్చని, ఇదే క్రమంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కు ఫిర్యాదు చేయొచ్చని, ఆ అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. కానీ ఇవేవీ చేయకుండా దాడికి దిగడం అత్యంత ప్రమాదాన్ని సూచిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడిని ప్రతి ఒక్కరూ, ప్రజాస్వామికవాదులు ఖండించాలని కోరారు. మీడియా పై దాడి అప్రజాస్వామికమని, ప్రజాస్వామ్య ప్రక్రియలో నమ్మకం వున్నా రాజకీయ శక్తులు భౌతిక దాడులకు తెగబడవని పేర్కొన్నారు.





