newsseals.com

రేవంత్ రెడ్డీ జ‌ర నోరు జాగ్ర‌త్త : హ‌రీశ్ రావు

July 12, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి తాజాగా చేసిన కామెంట్స్ పై. ఆయ‌న త‌న స్థాయిని మ‌రిచి పోయి మాట్లాడుతున్నాడ‌ని, ఇది త‌గ‌ద‌ని హిత‌వు ప‌లికారు. ఆదివారం తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు హ‌రీష్ రావు. రైతులపై వ్యాఖ్యల విషయంలో రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఒక బాధ్య‌త క‌లిగిన ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న త‌ను ఇలాగేనా మాట్లాడేది అని ప్ర‌శ్నించారు. రైతులు నీళ్లు అడుగుతున్నారు, కానీ ముఖ్యమంత్రి రక్తం గురించి మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భాషకు చోటు లేదని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తమ రాజకీయ ప్రచారాన్ని కొనసాగించడం కోసమే, తగినంత నీటి ప్రవాహం ఉన్నప్పటికీ అందుబాటులో ఉన్న గోదావరి నీటిని వినియోగించు కోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా నిరాకరిస్తోందని హరీష్ రావు ఆరోపించారు.

కరువు పరిస్థితుల మధ్య రాష్ట్ర సాగునీటి అవసరాలను నిర్లక్ష్యం చేస్తూ, రాజకీయ ప్రత్యర్థులపై రెచ్చగొట్టే భాషను ఉపయోగిస్తున్నారని ఇది ఎంత మాత్రం మంచిది కాద‌న్నారు హ‌రీశ్ రావు. ముఖ్యమంత్రి ఇటీవల మీడియాతో మాట్లాడిన తీరు “ఆందోళనకరంగా, రాజ్యాంగ పదవికి తగనిదిగా” ఉందని, అది “అబద్ధాలు, దూషణలు, ఆందోళనకరమైన మనస్తత్వాన్ని” ప్రతిబింబిస్తోందని అభివర్ణించారు. సాగునీటి కోసం రైతుల డిమాండ్‌కు స్పందించక పోగా, ముఖ్యమంత్రి “రాజకీయ ప్రత్యర్థుల రక్తం చిందించాలని”, “వారిని బెల్టులతో కొట్టాలని” మాట్లాడారని, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి నోటి నుండి ఇలాంటి వ్యాఖ్యలు రావడం దిగ్భ్రాంతి కలిగించాయని హరీష్ రావు అన్నారు.

Related News