Friday, 16 October 2026

రైతులు ప్ర‌త్యామ్నాయ పంట‌లు సాగు చేయాలి

newsseals-VakitiSrihari

హైద‌రాబాద్ : మంత్రి వాకిటి శ్రీహరి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను కూడా రైతు కుటుంబం నుంచే వ‌చ్చాన‌ని అన్నారు. గతంలో కూడా దేశం ఎల్‌నినో ప్రభావాలను ఎదుర్కొందని, 1951 నుంచి ఇప్పటి వరకు భారత్‌ 12 సార్లు ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొందని తెలిపారు. కరువును ఎలా ఎదుర్కోవాలో రైతులకు అవగాహన ఉన్నప్పటికీ, ఆ అవగాహనను ఆచరణలో పెట్టేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందన్నారు. పంటల మార్పిడి ద్వారా వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకు రావచ్చని, రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఆస్ట్రేలియా వంటి దేశాలు ముందస్తు కార్యాచరణతో ఎల్‌నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాయని, తెలంగాణ కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు.

కరువు పరిస్థితుల్లో పశువుల పెంపకం, సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి. చేపల పెంపకానికి అవసరమైన నీటిని అందుబాటులో ఉంచేందుకు చెరువులు, చెక్‌డ్యామ్‌ల ద్వారా వర్షపు నీటిని నిల్వ చేయాలని సూచించారు. మేకలు, గొర్రెల మేత కోసం ప్రత్యేక ప్రాంతాలను గుర్తించి కేటాయించడం ద్వారా పశు సంపదను పెంచుకోవచ్చన్నారు. ఎలాంటి కరువు పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ముందుకు సాగే రైతుకు ప్రభుత్వం అండగా నిలవాలని, భరోసా కల్పించాలని అన్నారు. ముందస్తు ప్రణాళికతో తెలంగాణను దేశానికే ఒక మోడల్‌గా నిలపవచ్చని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *