Friday, 16 October 2026

నేపాల్ లో ఏపీ వాసుల‌ పరిస్థితిపై అనిత వంగ‌ల‌పూడి ఆరా

newsseals-AnithaVangalapudi

అమ‌రావ‌తి : వ‌ర‌ద‌లు నేపాల్ దేశాన్ని అత‌లాకుత‌లం చేస్తున్నాయి. భార‌త దేశానికి చెందిన ప‌లువురు యాత్రికులు ఇందులో చిక్కుకున్నారు. ఇందులో ఇరు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ ప్రాంతాల‌కు చెందిన ప‌ర్యాట‌కులు ఉన్నారు. దీంతో వారి పరిస్థితిపై ఆరా తీశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. సీఎం ఆదేశాల మేర‌కు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత నేపాల్ వరదల పరిస్థితిపై వివ‌రాలు అడిగి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఏపీ యాత్రికుల క్షేమం, తాజా పరిస్థితి, సహాయక చర్యలపై సమీక్ష చేప‌ట్టారు శుక్ర‌వారం.

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులు ధైర్యంగా ఉండాల‌ని కోరారు వంగ‌ల‌పూడి అనిత‌. వారి వివరాలను తక్షణమే సేకరించి ప్రతి ఒక్కరి భద్రత, క్షేమంపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసు కోవాల‌న్నారు హోంమంత్రి . ఢిల్లీలోని ఏపీ భవన్, కేంద్ర విదేశాంగ శాఖ, నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం టచ్‌లో ఉంటూ సమన్వయం కొనసాగించాలని ఆదేశించారు. ఏపీ యాత్రికులకు అత్యవసర సహాయం అవసరమైతే వెంటనే స్పందించాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందించి క్షేమంగా స్వస్థలాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టాల‌న్నారు.

ఏపీ యాత్రికుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ బాధిత కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని పేర్కొన్నారు అనిత వంగ‌ల‌పూడి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి ఒక్కరినీ సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతాం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *