జీతం చెల్లింపులో జాప్యంపై హక్కుల కమిషన్ సీరియస్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. రిటైర్డ్ ఇంజనీర్ ఎం. శ్రీనివాస్‌కు జీతం చెల్లింపులో జాప్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదుదారుడు అక్టోబర్ 23, 2015 నుండి ఫిబ్రవరి 24, 2017 వరకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేశారు. చైర్‌పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు జీతం చెల్లింపులో జరిగిన సుదీర్ఘ జాప్యం , తద్వారా ఆదాయపు పన్ను నిబంధనలను పాటించడంలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులకు సంబంధించి ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఆ కాలానికి సంబంధించిన జీతం క్రమం తప్పకుండా చెల్లించ బడలేదని, చివరికి అక్టోబర్ 2018లో ఆయన గత పని ప్రదేశం నుండి ‘లాస్ట్ పే సర్టిఫికేట్’ అందిన తర్వాత రూ. 14,24,488 మొత్తాన్ని ఏకమొత్తంగా చెల్లించారని ఆయన ఫిర్యాదు చేశారు.
అవసరమైన ‘ఫారం-16’, బిల్లుల వారీ వివరాలు మరియు టీడీఎస్ చెల్లింపులకు సంబంధించిన వివరాలను తనకు సకాలంలో అందించ లేదని వాపోయారు. దీనివల్ల ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయనందుకు ఆదాయపు పన్ను శాఖ నుండి ‘షో-కాజ్’ నోటీసులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. సంబంధిత అధికారులు సమర్పించిన నివేదికలను పరిశీలించిన కమిషన్, ఫిర్యాదుదారుని జీతం చెల్లింపులో ఏడాదికి పైగా జాప్యం జరిగిందని గుర్తించింది. ఒక ఉద్యోగి బదిలీ అయినప్పుడు, సర్వీస్ ప్రయోజనాల కొనసాగింపు , సకాలంలో జీతం చెల్లింపును నిర్ధారించడానికి, సంబంధిత పరిపాలనా అధికారులు సర్వీస్ రిజిస్టర్, ఎల్పీసీ, ఇతర సంబంధిత సర్వీస్ రికార్డులను బదిలీ అయిన ప్రదేశానికి సకాలంలో పంపేలా చూడాలని కమిషన్ స్పష్టం చేసింది.
జీతం అనేది కేవలం పరిపాలనా పరమైన ప్రయోజనం మాత్రమే కాదని, ఉద్యోగి అందించిన సేవలకు గాను పొందే చట్టబద్ధమైన ప్రతిఫలమని కమిషన్ పేర్కొంది. జీతాన్ని సుదీర్ఘకాలం పాటు నిలిపి వేయడం వల్ల ఉద్యోగి , అతని కుటుంబం యొక్క ఆర్థిక భద్రత, జీవనోపాధి , గౌరవంపై తీవ్ర ప్రభావం పడుతుందని కమిషన్ అభిప్రాయ పడింది. జీతం చెల్లించడంలో సంబంధిత శాఖాధిపతులు అంటే హైదరాబాద్‌లోని పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ‘ఇంజనీర్-ఇన్-చీఫ్స . వరంగల్‌లోని ‘గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ విఫలమయ్యారని కమిషన్ నిర్ధారించింది. ‘మానవ హక్కుల పరిరక్షణ చట్టం, 1993’లోని సెక్షన్ 18 ప్రకారం తనకు సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ కమిషన్ ఒక సిఫార్సు చేసింది.