newsseals.com

నాలెడ్జ్ ఎకాన‌మీలో తెలంగాణ ముందంజ

September 1, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : నాలెడ్జ్ ఎకాన‌మీలో హైద‌రాబాద్ లో టాప్ లో ఉంద‌న్నారు ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు. సాఫ్ట్‌వేర్‌, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌, పరిశోధన, గ్లోబల్‌ కెపాబిలిటీ సెంటర్లలో హైదరాబాద్‌ ముందుందని చెప్పారు. టెక్నాలజీ, ఇంజినీరింగ్‌ కాలేజీలు, బిజినెస్‌ స్కూళ్లు, మెడికల్‌ కాలేజీలు, యూనివర్సిటీల నుంచి మంచి విద్య పొందిన మానవ వనరులే హైదరాబాద్‌ అభివృద్ధికి ప్రధాన బలమన్నారు. హైదరాబాద్‌లో గ్లోబల్‌ నాలెడ్జ్‌ హబ్‌ ఏర్పాటైతే మరిన్ని గ్లోబల్‌ కెపాబిలిటీ సెంటర్లు, కంపెనీలు తెలంగాణకు వచ్చే అవకాశం ఉందన్నారు. స్కిల్స్‌ యూనివర్సిటీ, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు, పాలిటెక్నిక్‌ కాలేజీల ద్వారా నైపుణ్యం కలిగిన బ్లూ కాలర్‌ ఉద్యోగులను తయారు చేస్తామని చెప్పారు. దీనివల్ల రాష్ట్రంలో తయారీ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

డాక్టర్‌ ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ శాంతకుమారి మాట్లాడుతూ ప్రపంచస్థాయి విద్యా సంస్థల స్వల్పకాలిక కోర్సులు, ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్‌లను హైదరాబాద్‌లో ప్రారంభిస్తామని తెలిపారు. ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు ఇన్‌స్టిట్యూట్‌లోని తరగతి గదులను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. నవంబర్‌ నుంచే హైదరాబాద్‌లోని ప్రజలు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు ప్రపంచంలోని ప్రముఖ విద్యాసంస్థలు నిర్వహించే విద్యా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు.

ముఖ్యమంత్రి సలహాదారు, ఎక్స్‌-ఆఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో గ్లోబల్‌ నాలెడ్జ్‌ హబ్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. డాక్టర్‌ ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో వివిధ సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో భారత్‌ ఫ్యూచర్‌ సిటీలోనూ గ్లోబల్‌ నాలెడ్జ్‌ హబ్‌కు అవసరమైన సదుపాయాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌లో ప్రపంచస్థాయి విద్యాసంస్థల కోసం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రపంచ విద్యాసంస్థలు, క్రీడా సదుపాయాలు రాష్ట్ర అభివృద్ధిపై చూపే ప్రభావంపై ప్రత్యేక ట్రాక్‌ ఏర్పాటు చేయాలని సూచించారు.

Related News