newsseals.com

విద్యార్థుల ఫీజు బకాయిలు విడుద‌ల చేయాలి : డీకే అరుణ

September 4, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : మహ‌బూబ్ న‌గ‌ర్ పార్ల‌మెంట్ స‌భ్యురాలు డీకే అరుణ భ‌ర‌త సింహా రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచందర్ రావు , ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి , గౌతం రావు , BJYM అధ్యక్షులు గణేష్ కుండే , బండారు విజయలక్ష్మితో కలిసి తాము సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చాం అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపుకై తాము సేకరించిన సంతకాల పత్రాలతో సెక్రటేరియట్ ఎదుట నిరసన తెలుపుతుంటే, మమ్మల్ని అరెస్ట్ చేసి గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ కి తరలించడం దారుణ‌మ‌న్నారు.

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని వినతి పత్రం అందజేసేందుకు తాము వెళ్తే పోలీసులు అడ్డుకోవడం అత్యంత దుర్మార్గం అన్నారు డీకే అరుణ భ‌ర‌త సింహారెడ్డి. ఫీజు బకాయిలు విడుదల చేయక పోతే సీఎం రాజీనామా చేసి వెంటనే గద్దె దిగాలి అన్నారు. విద్యార్థుల ఫీజులు చెల్లించలేక తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కాలేజ్ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వక పోవడంతో యువత నిరుద్యోగులుగా మిగిలి పోతున్నారని మండిప‌డ్డారు. అయినా సీఎంకు సోయి ఉండ‌డం లేద‌న్నారు డీకే అరుణ‌. కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందు విద్యార్థులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలన్నారు. ఫీజు బకాయి – బీజేపీ ల‌డాయి పేరుతో తాము ప్రతి కాలేజీకి వెళ్లి విద్యార్థుల సంతకాలను సేకరించాం అన్నారు. విద్యార్థుల పక్షాన బీజేపీ పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తుందని ప్ర‌క‌టించారు.

Related News