ఓల్డ్ సిటీకి మెట్రో తీసుకు వస్తాం : సీఎం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆయన హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ వాసులకు తీపి కబురు చెప్పారు. ఓల్డ్ సిటీకి త్వరలోనే మెట్రో తీసుకు వస్తామన్నారు. అదే మెట్రో రైలులో వచ్చి ఓట్లు అడుగుతాం అని చెప్పారు. అసద్ సాబ్ ఆ రోజు చెప్పింది అక్షరాల నిజం. మెట్రో రైలు మొత్తం కొత్త నగరంలో (న్యూ సిటీలో) నిర్మించారు, మరి ఓల్డ్ సిటీలో రోజూ పనులకు వెళ్లే మన ముస్లిం సోదరులకు మెట్రో అవసరం లేదా? మేము మెట్రో ఎక్కకూడదా? అని ఆయన అడిగారు. తను అడిగిన ప్రశ్న నాకు నూటికి నూరు శాతం సరైనదే అనిపించింది. అందుకే నేను ఆ రోజే చెప్పాను “సాబ్, డబ్బులు నేను ఇస్తాను. రోడ్డు విస్తరణకు అవసరమైన స్థలాలు ఇప్పించే బాధ్యత మీది” అని చెప్పాను.
900 ప్రాపర్టీలలో ఇప్పటికే 850 ప్రాపర్టీలను ఇప్పించారు. మరో 50 మిగిలితే, మా ఇన్‌ఛార్జ్ మినిస్టర్‌కు చెప్పాను . వెళ్లి అసద్ సాబ్‌తో మాట్లాడి ఆ 50 కూడా క్లియర్ చేయించండి, ఎంత డబ్బులు అడిగినా ఇచ్చేయండి అని చెప్పాను. డిసెంబర్‌లో పనులు ప్రారంభం కానున్నాయి. పనులు సజావుగా సాగితే, మీరంతా సహకరిస్తే… రెండున్నరేళ్లలో గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రోలో మనం వచ్చేస్తాం అని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో అదే మెట్రో రైలులో ప్రయాణించి వచ్చి ఇక్కడ మిమ్మల్ని కలుస్తాం. ఆ మాటకు నేను ఈ రోజుకీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి.