భువనేశ్వర్ : అనేక రాష్ట్రాల్లో ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ కొనసాగుతుండగా మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ వై ఖురేషీ ఆదివారం నాడు భారత ఎన్నికల సంఘం (ఈసీ) పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అక్రమ వలసదారులను గుర్తించడమే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని చెబుతున్నప్పటికీ ఓటర్ల తొలగింపు భారీ స్థాయిలో జరగడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ ప్రక్రియ ద్వారా భారతదేశ జనాభాలో సుమారు 14–15 కోట్ల మందిని తొలగించే అత్యంత క్లిష్టమైన పనిని పూర్తి చేసినందుకు ఎన్నికల సంఘాన్ని ఎద్దేవా చేశారు ఈ ప్రక్రియ యొక్క ప్రధాన ఉద్దేశమైన అక్రమ వలసదారులను వారు ఎంతమందిని గుర్తించారో నాకు తెలియదు. ఆ సంఖ్యను వారు వెల్లడించక పోవడం విచారకరం అని ఆయన ANIతో అన్నారు. నేషనల్ పాపులేషన్ కమిషన్ సాధించలేని పనిని సాధించినందుకు తమ “గొప్ప విజయాన్ని” చాటుకోవడానికి ఆ గణాంకాలను బహిర్గతం చేయాలని ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు.
వారు దయచేసి ఆ సంఖ్యను బయట పెట్టాలని తాను కోరుతున్నానని పేర్కొన్నారు ఖురేషి. తద్వారా మీరు ఎంత గొప్ప విజయాన్ని సాధించారో, అలాగే నేషనల్ పాపులేషన్ కమిషన్ చేయలేని పనిని మీరు ఎలా చేశారో మాకు తెలుస్తుందని పేర్కొన్నారు. భారతదేశ జనాభాలో సుమారు 15% మందిని తొలగించడం ద్వారా మీరు జనాభా నియంత్రణకు ఎంతో దోహద పడ్డారంటూ ఎద్దేవా చేశారు. ఈ ప్రక్రియను ఖురేషీ విమర్శించడం ఇదే మొదటిసారి కాదన్నారు. సర్ ప్రక్రియ “సదుద్దేశంతో కూడినది కాదు” అని ఆయన గతంలోనే వ్యాఖ్యానించారు. ఓటు హక్కు అనేది రాజ్యాంగ బద్ధమైన హక్కు అని, అది ఎన్నికల సంఘం ప్రసాదించే “భిక్ష” కాదని ఆయన వాదించారు. ఈ మొత్తం SIR ప్రక్రియ వెనుక సరైన ఉద్దేశం లేదని నేను భావిస్తున్నాను. కోట్లాది మంది ఓటర్ల పేర్లను తొలగించిన తీరు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేలా ఉందన్నారు. మీరు భారతీయ పౌరులు, నేను భారతీయ పౌరుడిని. ఓటు వేయడం మన రాజ్యాంగపరమైన హక్కు.
ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో నమోదు కావాలని ఆర్టికల్ 326 చెబుతోంది. కాబట్టి, ఓటు హక్కు కల్పించడం అనేది ఎన్నికల సంఘం మనకు చేసే ఏదో దానధర్మం కాదు అని ఆయన అన్నారు. ECI (భారత ఎన్నికల సంఘం) పత్రికా ప్రకటన ప్రకారం, ఓటర్ల జాబితాలను ఖచ్చితమైనవిగా, తాజా సమాచారంతో కూడినవిగా , అనర్హులు లేదా నకిలీ పేర్లు లేకుండా ఉంచే లక్ష్యంతో పాటు, అర్హులైన ఓటర్లు ఎవరూ జాబితాలో లేకుండా పోకుండా చూసేందుకు అనేక రాష్ట్రాల్లో ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ప్రక్రియను చేపడుతున్నారు. ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియను అక్టోబర్ 2025లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞనేష్ కుమార్ దేశ వ్యాప్తంగా ప్రకటించారు. వలసలు, ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటరుగా నమోదు కావడం, మరణించిన వారి పేర్లు తొలగించ బడక పోవడం, విదేశీయులు ఓటర్ల జాబితాలో చేరడం వంటి అంశాలను ఈ నిర్ణయానికి కారణాలుగా ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రక్రియ అప్పటి నుండి అనేక రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలలో అమలు చేశారు. వీటిలో చాలా ప్రాంతాల్లో ఎన్నికలు జరిగాయి లేదా జరగబోతున్నాయి. ఈ కార్యక్రమంపై ప్రతిపక్ష పార్టీల నుండి నిరంతర విమర్శలు వస్తున్నాయి. ఇటీవల, మహారాష్ట్రలో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ తర్వాత సర్ ప్రక్రియపై పరిశీలన పెరిగింది. ఈ జాబితాలో గత ఓటర్ల జాబితా కంటే రెండు కోట్ల మంది ఓటర్లు తక్కువగా కనిపించారు. మహారాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఆగస్టు 17 నాటికి, మొత్తం 9,78,54,049 మంది ఓటర్లలో 7,71,65,562 మంది SIR గణన దశలో తమ దరఖాస్తు ఫారమ్‌లను సమర్పించారు. SIR కింద మహారాష్ట్ర ఓటర్ల జాబితా నుండి రెండు కోట్ల మంది ఓటర్ల పేర్లను తొలగించారన్న ఆరోపణలపై కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా భారతీయ జనతా పార్టీ (BJP)ని విమర్శించారు. రాష్ట్రంలో ఓట్లు నిజ-సమయంలో “దొంగిలించ బడుతున్నాయని” ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో, అధికార BJP , ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ ప్రక్రియ ఒక ప్రధాన వివాదాస్పద అంశంగా మారింది.





