అమరావతి : సంప్రదాయ హస్తకళల వారసత్వ పరిరక్షణ, హస్తకళాకారులకు చేయూత ఇచ్చేందుకు చేపట్టిన కార్యక్రమాలను వేగవంతంగా ముందుకు తీసుకు వెళ్లాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. హస్తకళాకారుల సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన, మెరుగైన మార్కెటింగ్ వసతుల కల్పన ద్వారా మెరుగైన జీవనోపాధి, ఆరోగ్య రక్షణ తదితర అంశాలను అత్యంత ప్రాధాన్యతా క్రమంలో ముందుకు తీసుకు వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా క్లస్టర్లవారీగా నిర్మించతలపెట్టిన కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటు వివరాలు అధికారుల నుంచి పొందారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవ ప్రారంభోత్సవం కార్యక్రమంలో విభిన్న హస్తకళలను వారసత్వంగా ముందుకు తీసుకు వెళ్తున్న కళాకారులతో మమేకమయ్యారు. స్వయంగా వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
తన దృష్టికి వచ్చిన సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషించి, స్వీయ పర్యవేక్షణలో ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థతో పాటు జిల్లా యంత్రాంగంతో నిరంతరం సమీక్షిస్తూ హస్త కళాకారులకు ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తున్నారు. కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయాలని హస్తకళా మహోత్సవంలో పలువురు కళాకారులు అడగగా ఏర్పాటుకు ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తక్షణం అందుకు కార్యాచరణ రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పుడు ఇచ్చిన హామీ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు, లేపాక్షి అధికారులకు స్థల సేకరణ, నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. సవర గిరిజన చిత్రకారుల కోసం పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలో కామన్ ఫెసిలిటీ కోసం స్థల సేకరణ పూర్తి చేయడంతో పాటు వీబీ-జీ రామ్ జీ నిధులతో నిర్మాణ పనులు కూడా ప్రారంభించారు.





