బ్రహ్మోత్సవాల్లో భక్తులకు విశేష సేవలందించండి
తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహించే టిటిడి ఉద్యోగులు భక్తులకు అంకితభావంతో విశేష సేవలందించాలని టిటిడి జేఈవో (హెచ్‌అండ్‌ఈ) ప్రభల గోపినాథ్ కోరారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో డిప్యూటేషన్ ఉద్యోగుల కోసం శ్వేత ఆధ్వర్యంలో గురువారం శ్రీ వేంగమాంబ సమావేశ మందిరంలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులకు సేవలందించే ఉద్యోగులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించగలరని అన్నారు. మధుమేహాన్ని ప్రారంభ దశలోనే గుర్తించడం ఎంతో ముఖ్యమని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధిని సకాలంలో గుర్తించి నియంత్రించవచ్చని తెలిపారు. వైద్య పరీక్షలతో పాటు క్రమబద్ధమైన శారీరక శ్రమ, సమతుల్య పోషకాహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలని సూచించారు. మధుమేహాన్ని ముందుగానే గుర్తించి, క్రమమైన పరీక్షలు, సరైన చికిత్సతో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని చెప్పారు.
అనంతరం బ్రహ్మోత్సవాల సమయంలో ఉద్యోగులు తమ రక్తంలోని గ్లూకోజ్ స్థాయులను ఎప్పటికప్పుడు పరిశీలించు కునేందుకు వీలుగా జేఈవో చేతుల మీదుగా గ్లూకోమీటర్లను పంపిణీ చేశారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి చెందిన మధుమేహ వ్యాధి నిపుణులు డా. జయప్రకాశ్ సాయి మాట్లాడుతూ మధుమేహం లక్షణాలు కనిపించే వరకు వేచి చూడకుండా సకాలంలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సమతుల్య పోషకాహారం తీసుకోవడం, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లను సరైన మోతాదులో తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవచ్చన్నారు. రక్తంలో చక్కెర స్థాయి, హెచ్‌బీఏ1సీ, రక్తపోటు, కొలెస్ట్రాల్, శరీర బరువు తదితర అంశాలను క్రమం తప్పకుండా పరిశీలించు కోవాల్సిన అవసరాన్ని వివరిస్తూ ‘నో యువర్ డయాబెటిస్ నంబర్స్’ ప్రాముఖ్యతను వివరించారు. ఉద్యోగులకు బ్లడ్ గ్లూకోజ్ స్క్రీనింగ్, డయాబెటిస్ రిస్క్ అసెస్‌మెంట్, పోషకాహార సలహాలు, వ్యాయామం, మధుమేహ నియంత్రణ తదితర అంశాలపై వైద్య నిపుణులు అవగాహన కల్పించారు.
శ్వేత డైరెక్టర్ డా. వేమా వేంకట రత్నం మాట్లాడుతూ డిప్యూటేషన్‌పై విధులు నిర్వహించే ఉద్యోగులు భక్తులలో భగవంతుడిని దర్శించుకుంటూ సేవాభావంతో తమ విధులను నిర్వర్తించాలని కోరారు. వైద్య నిపుణులు సూచించిన ఆరోగ్య సలహాలను నిరంతరం పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడు కోవాలని సూచించారు.మధుమేహ నియంత్రణలో పోషకాహారం ప్రాధాన్యతపై సీనియర్ డైటిషియన్ డా. మానస కోసిరెడ్డి, మధుమేహ వ్యాధిగ్రస్తులకు శారీరక వ్యాయామం ప్రాధాన్యతపై ఫిజియోథెరపిస్ట్ డా. వినయ్, డా. సంధ్యారాణి తదితరులు అవగాహన కల్పించారు . అనంతరం ఉద్యోగులకు మధుమేహ పరీక్షలు నిర్వహించి, అవసరమైన ఆరోగ్య సూచనలు అందించారు. గ్లూకోమీటర్లను కూడా పంపిణీ చేశారు.