ఏపీలో రూ.15,000 కోట్ల గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్
అమరావతి : రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎండీఎల్ శుక్రవారం తిరుపతి జిల్లాలోని దుగరాజపట్నంలో రూ.15,000 కోట్ల పెట్టుబడితో ఆధునిక గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌ను అభివృద్ధి చేయడానికి NSHIP-APతో ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు సమక్షంలో కుదిరిన ఈ ఒప్పందం, ఐదు నుంచి ఏడేళ్ల పాటు కొనసాగుతూ, సుమారు 45,000 ఉద్యోగాలను సృష్టిస్తుందని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. దుగరాజ పట్నంలో ఒక ఆధునిక గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌ను అభివృద్ధి చేయడానికి మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్, నేషనల్ షిప్‌బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ పార్క్-ఆంధ్రప్రదేశ్ (NSHIP-AP)తో ఒప్పందం కుదుర్చుకుంది అని వెల్లడించింది. 2047 నాటికి ప్రపంచంలోని అగ్ర ఐదు నౌకా నిర్మాణ దేశాలలో ఒకటిగా నిలవాలన్న భారతదేశ ఆశయానికి ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండటానికి కట్టుబడి ఉందని సీఎం నాయుడు అన్నారు.
తన సుదీర్ఘ తీరప్రాంతం వ్యూహాత్మక ప్రదేశం , పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను సద్వినియోగం చేసుకుంటూ ఈ ప్రయాణంలో ముందంజలో ఉండటానికి ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు . ఆంధ్రప్రదేశ్‌ను ఒక ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా నిలబెట్టి రాష్ట్రానికి పెట్టుబడులను , అనుబంధ పరిశ్రమలను ఆకర్షిస్తుందన్నారు. ఈ ప్రాజెక్ట్ షిప్‌బిల్డింగ్, మెరైన్ ఇంజనీరింగ్, తయారీ, లాజిస్టిక్స్ఇ, తర అనుబంధ రంగాలలో భారీ ఎత్తున ఉపాధి , కొత్త అవకాశాలను కూడా సృష్టిస్తుందని ఆయన అన్నారు. ప్రతిపాదిత షిప్‌యార్డ్ సంవత్సరానికి 1.2 మిలియన్ స్థూల టన్నేజీ డిజైన్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందన్నారు. మార్కెట్ అవసరాల ఆధారంగా మరింత విస్తరణకు ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు.