ఏపీ డిజిటల్ కార్పొరేషన్ కు గోల్డ్ అవార్డు
అమరావతి : రాజకీయ రంగంలో అపారమైన అనుభవం కలిగిన , పాలనా పరంగా తనదైన ముద్ర వేసేలా ప్రయత్నం చేసిన ఘనత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుది. ఆయన వయసు 75 ఏళ్లు అయినా ఇప్పటికీ కుర్రాళ్ల తో పోటీ పడుతూ ముందుకు సాగుతున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏపీ అభివృద్దికి బాటలు వేస్తోంది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ కు (APDC) అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిజిటల్ , సోషల్ మీడియా ప్రచారం , అవగాహన కార్యక్రమానికి గోల్డ్ అవార్డు లభించింది.
దేశ వ్యాప్తంగా అత్యంత పరిమిత సంఖ్యలో అందించిన గోల్డ్ అవార్డుల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్‌కు దక్కడం గర్వ కారణమని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అదే విధంగా సమాచార, పౌర సంబంధాల శాఖకు మీడియా అక్రిడిటేషన్, మేనేజ్‌మెంట్ సిస్టమ్ కు సిల్వర్ అవార్డు లభించింది. దేశ వ్యాప్తంగా అందించిన 30 సిల్వర్ అవార్డుల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌర సంబంధాల శాఖకు దక్కడం హర్షణీయమని సీఎం అన్నారు. డిజిటల్ ఆవిష్కరణలు, సాంకేతిక ఆధారిత పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్న పురోగతికి జాతీయ స్థాయిలో లభించిన ఈ గుర్తింపు ప్రతి ఒక్కరికీ గర్వ కారణం అని అన్నారు. ఇది దక్కించుకున్న అధికారులకు అభినందనలు తెలిపారు.