శ్రీవారిని దర్శించుకున్న నారా లోకేష్
తిరుమల : రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం తిరుమలకు విచ్చేశారు. ఆయన
సింగపూర్ హోం శాఖ మంత్రి కే.షణ్ముగంతో కలిసి కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించు కునేందుకు సోమవారం రాత్రి తిరుమల చేరుకున్న సింగపూర్ హోంమంత్రి కే.షణ్ముగంకు మంత్రి లోకేష్ స్వాగతం పలికారు. అనంతరం ఈ ఉదయం గౌరవ మర్యాదలతో షణ్ముగంను శ్రీవారి దర్శనానికి తోడ్కొని వెళ్లారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు.
ఇరువురు కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు తిరుపతి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక టీడీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఘనస్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు నారా లోకేష్. కోట్లాది మంది భక్తులకు కొంగు బంగారంగా తిరుమల కొనసాగుతోందన్నారు. తమ కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్ద ఎత్తున వసతి సౌకర్యాలను కల్పించడం జరిగిందన్నారు. సామాన్యులకే పెద్ద పీట వేస్తున్నామన్నారు.