బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయండి : సీఎం
బెంగళూరు : బెంగళూరుకు ఆవల కూడా పెట్టుబడులు పెట్టాలని కోరారు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్. పెట్టుబడి అవకాశాలను గుర్తించడం , వాణిజ్య సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా చెక్ ప్రతినిధి బృందం అక్టోబర్ 11 నుండి 16 వరకు భారతదేశంలో (బెంగళూరుతో సహా) పర్యటిస్తోంది. ఇంధన రంగం, ఆటోమొబైల్ విడిభాగాలు, భవిష్యత్ రవాణా , ఏరోస్పేస్ , రక్షణ రంగాలను సహకారానికి అనువైన రంగాలుగా గుర్తించడాన్ని స్వాగతించారు. ఆవల ఉన్న జిల్లాల్లో కూడా పెట్టుబడులు పెట్టాలని డీకే శివకుమార్ చెక్ కంపెనీలను కోరారు. పెట్టుబడి అవకాశాలపై చర్చించడానికి , కర్ణాటక-చెక్ రిపబ్లిక్ మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి, చెక్ రిపబ్లిక్ ఉప ప్రధాని , పరిశ్రమల శాఖ మంత్రి కారెల్ హావ్లిసెక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం విధాన సౌధలో శివకుమార్ను కలిసింది.
కర్ణాటక చెక్ రిపబ్లిక్కు దీర్ఘకాలిక భాగస్వామిగా ఉంటుంది. చెక్ కంపెనీలు తమ కార్యకలాపాలను కేవలం బెంగళూరుకే పరిమితం చేసుకోకుండా కర్ణాటకలోని వివిధ జిల్లాల్లో పెట్టుబడులు పెట్టాలి అని శివకుమార్ సూచించారు. వ్యవసాయం, అటవీశాఖ, ఉద్యానవన, పూల సాగు రంగాలలో రాష్ట్రానికి ఉన్న బలాన్ని వివరిస్తూ పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా కర్ణాటకను పరిగణించాలని ఆయన చెక్ కంపెనీలను కోరారు. ఇంధన రంగంలోని అవకాశాలను ప్రస్తావిస్తూ, భారీ ఇంధన అవసరాలు ఉండటంతో పాటు, భారతదేశంలోని అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రాలు , అత్యంత పురాతన జలవిద్యుత్ కేంద్రాలకు కర్ణాటక నిలయంగా ఉందని శివకుమార్ తెలిపారు.