newsseals.com

కూకట్ ప‌ల్లి నాలా విస్తరణకు హైడ్రా చర్యలు

October 16, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : ఫతేనగర్‌ – బాలానగర్‌ పారిశ్రామిక, నివాస ప్రాంతాల్లో వరద ముప్పును శాశ్వతంగా పరిష్కరించేందుకు హైడ్రా రంగంలోకి దిగింది. ఈ క్రమంలో ఇప్పటికీ కూకట్పల్లి నాలాలో పూడికతీత పనులను ముమ్మరంగా చేపట్టింది. ఆక్రమణలు తొలగించడంపై దృష్టి పెట్టింది. పేదవాళ్ళ నివాసాల జోలికి వెళ్లకుండా ఈ చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమీక్షించారు. సీ‌ఎంసీ, ఎంఎంసీ, పారిశ్రామికవాడ కోఆపరేటివ్‌ సొసైటీ ప్రతినిధులు, ఐలా (ILA) అధికారులు, సంబంధిత శాఖల అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఫతేనగర్‌–బాలానగర్‌ పారిశ్రామిక ప్రాంతాల్లో వరద ముప్పును శాశ్వతంగా నివారించాలంటే నాలాల్లో పూడికతీతతో పాటు, ఆక్రమణలను తొలగించి నాలాను విస్తరించడం అత్యంత కీలకమని హైడ్రా కమిషనర్‌ అన్నారు. చెరువుల నుంచి వచ్చే వరద నీరు ఎలాంటి ఆటంకాలు లేకుండా నాలాల ద్వారా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ సూచించారు. నాలా పొడుగునా పారిశ్రామికవాడ లేఅవుట్ ను పరిశీలిస్తే ఆక్రమణలు ఎంతమేర జరిగాయనేది స్పష్టం అవుతుందన్నారు.

సికింద్రాబాద్ ప్యాట్నీ నాలా విస్తరణ మాదిరి ఇక్కడ కూడా పనులు జరగాలన్నారు. ప్యాట్నీ నాల విస్తరణతో ఎగువున ఉన్న వేల కుటుంబాలకు, పదుల సంఖ్యలో ఉన్న బస్తీలకు వరద ముప్పు తప్పించామని గుర్తు చేశారు. పరికిచెరువు, ఐడీఎల్‌ చెరువుల నుంచి వచ్చే వరద నీరు కూకట్‌పల్లి నాలా ద్వారా ప్రవహిస్తుండగా, ఫాక్స్‌ సాగర్‌ నుంచి జీడిమెట్ల మీదుగా వచ్చే వరద కాలువ గౌతంనగర్‌ పరిసరాల్లో ఈ నాలాలో కలుస్తుంది. ఇలా హుస్సేన్‌సాగర్‌లో కలిసే వరకు నల విస్తరణ చేపట్టాల్సి ఉంది. ఫతేనగర్‌ ప్రాంతంలో సుమారు 40 మీటర్ల వెడల్పు ఉండాల్సిన నాలా కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణల కారణంగా కేవలం 9 మీటర్లకు కుంచించుకు పోయిందని అధికారులు కమిషనర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఫతేనగర్‌–బాలానగర్‌ పారిశ్రామిక ప్రాంతాల్లోని నాలా మొత్తం సుమారు 4.2 కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని, ఇందులో 2.2 కిలోమీటర్ల పరిధి సీ‌ఎంసీ పరిధిలోకి, మరో 2 కిలోమీటర్లు ఎంఎంసీ పరిధిలోకి వస్తాయని తెలిపారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తూ నాలా హద్దులను గుర్తించాలని, ఆక్రమణల తొలగింపునకు అవసరమైన చర్యలు చేపట్టాలని కమిషనర్‌ సూచించారు.

Related News