newsseals.com

వట్టెం ప్రాజెక్టుపై నిర్ల‌క్ష్యం త‌గ‌దు : మ‌ల్ల‌న్న‌

October 16, 2026 · VijayaBhaskar

వట్టెం (నాగర్‌కర్నూల్ జిల్లా ) : పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న వట్టెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు సుమారు రూ.5,500 కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఇప్పటి వరకు ప్రాజెక్టు పూర్తికాక పోవడంపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2015లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు దశాబ్ద కాలం దాటినా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడం బాధాకరం అన్నారు . బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా వట్టెం గ్రామానికి చేరుకున్న తీన్మార్ మల్లన్న వట్టెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను సందర్శించారు. రిజర్వాయర్ కట్టపై నుంచి ప్రాజెక్టు నిర్మాణం, సాగునీటి సరఫరా, పంపిణీ కాల్వల పరిస్థితి, నిర్వాసితుల సమస్యలు, ప్రభుత్వ వ్యయం తదితర అంశాలపై మాట్లాడారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ నుంచి వట్టెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోసి, అక్కడి నుంచి వివిధ పంపిణీ కాల్వల ద్వారా వ్యవసాయ భూములకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారని మల్లన్న వివరించారు.

సుమారు 15 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో రూపొందించిన ఈ రిజర్వాయర్ నిర్మాణానికి దాదాపు రూ.5,500 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు. అయితే భారీ మొత్తంలో ప్రజాధనాన్ని ఖర్చు చేసినప్పటికీ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. రిజర్వాయర్ ప్రధాన కట్ట నిర్మాణం పూర్తయినప్పటికీ నీటిని తరలించే వ్యవస్థలు, పంపిణీ కాల్వలు ఇంకా పూర్తి కాలేదని తెలిపారు. ప్రాజెక్టు లక్ష్యాలు నెరవేరక పోవడంతో రైతులకు ఆశించిన సాగునీటి ప్రయోజనాలు అందడం లేదని విమర్శించారు. 2023లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మోటార్లను ప్రారంభించినప్పటికీ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక పనులు ఇంకా పూర్తి కాలేదని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. మోటార్ల ప్రారంభోత్సవంతో ప్రాజెక్టు పూర్తయిందని, వట్టెం రిజర్వాయర్ నుంచి రైతుల పొలాలకు సాగునీరు అందుతుందని ప్రజల్లో ఆశలు కల్పించారని, వాస్తవానికి ప్రధాన నిర్మాణాలతో పాటు పంపిణీ కాల్వల పనులు పూర్తికాక పోవడంతో ప్రాజెక్టు ఆశించిన స్థాయిలో ఉపయోగంలోకి రాలేదన్నారు

సుమారు ఎనిమిది కిలోమీటర్ల పొడవైన కట్ట నిర్మాణం పూర్తయినప్పటికీ రిజర్వాయర్‌లోకి ప్రాజెక్టు లక్ష్యాలకు అనుగుణంగా నీటిని తీసుకు రాలేక పోయారని, ప్రస్తుతం రిజర్వాయర్‌లో కనిపిస్తున్నది కొంత వర్షపు నీరు మాత్రమేనని అన్నారు. ఎత్తిపోతల పథకం ద్వారా రావాల్సిన నీరు పూర్తిస్థాయిలో చేరలేదని తెలిపారు. భారీ వ్యయంతో నిర్మించిన రిజర్వాయర్ రైతులకు ఉపయోగపడే పరిస్థితి లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు మ‌ల్ల‌న్న‌. వట్టెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణంతోనే ప్రాజెక్టు లక్ష్యం నెరవేరదని, అక్కడి నుంచి సాగునీటిని వ్యవసాయ భూములకు తరలించే పంపిణీ కాల్వల నిర్మాణం అత్యంత కీలకమని అన్నారు. రిజర్వాయర్‌కు అనుసంధానంగా చేపట్టిన డిస్ట్రిబ్యూషన్ కాల్వల పనులు ఇప్పటికీ పూర్తిస్థాయిలో పూర్తి కాలేదని మండిపడ్డారు. కాల్వల నిర్మాణం పూర్తికాకుండా రైతులకు సాగునీరు అందిస్తామని చెప్పడం ఆచరణలో సాధ్యం కాదని, ప్రాజెక్టులో మిగిలి పోయిన పనుల వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని, వాటి పూర్తికి స్పష్టమైన కాలపరిమితిని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Related News