ఏపిని రావణ కాష్టంలా మార్చిన చంద్రబాబు
అమరావతి : రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. శుక్రవారం తమ పార్టీకి చెందిన ఎంపీ మిథున్ రెడ్డి వాహనంపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. అధికారం ఏ ఒక్కరికి శాశ్వతం కాదని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎంపీకి ఫోన్ చేశారు జగన్ రెడ్డి. టీడీపీ గూండాల దాడి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికలు సజావుగా జరపాలన్న ఉద్దేశం చంద్రబాబుకు లేదన్నారు. రెండున్నరేళ్ల పరిపాలన పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని అన్నారు. అందుకే దాడులకు దిగుతున్నారంటూ మండిపడ్డారు.
హింసా రాజకీయాలు చంద్రబాబుకు కొత్తేమీ కాదన్నారు. ఆయన చరిత్ర అంతా మోసం, దగా, దాడులు తప్పా ఏముందని ప్రశ్నించారు జగన్ రెడ్డి. రాష్ట్రాన్ని జంగిల్ రాజ్లా మార్చారని ఫైర్ అయ్యారు. లోక్సభలో పార్టీ నాయకుడికే భద్రతలేని పరిస్థితులు చూస్తున్నానని అన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు జరుగుతున్నా పోలీసు వ్యవస్థ నిస్తేజంగా ఉండి పోయిందన్నారు. ఈ అన్యాయాలను సమర్థంతంగా ఎదుర్కొంటాం అన్నారు. న్యాయపరంగా, చట్టపరంగా అన్ని రకాలుగా పోరాటం చేస్తాం అని ప్రకటించారు జగన్ రెడ్డి. రాష్ట్రంలో పరిస్థితులను కోర్టుల ముందు ఉంచుతాం అని తెలిపారు. పారా మిలటరీ బలగాలతోనే ఎన్నికలు సజావుగా సాగుతాయని లేకపోతే అక్రమంగా ఓట్లు దండుకునే ప్రమాదం పొంచి ఉందన్నారు.